రాచకొండ పోలీస్ స్టేషన్‌లో 63 మందిఆకతాయిలకు కౌన్సెలింగ్

By Siva KodatiFirst Published Feb 23, 2019, 3:47 PM IST
Highlights

మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సుమారు 63 మంది ఆకతాయిలును రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 46 మంది మేజర్లు కాగా, 17 మంది మైనర్లు. ఇవాళ నాగోల్‌లోని కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో వీరందరికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సుమారు 63 మంది ఆకతాయిలును రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 46 మంది మేజర్లు కాగా, 17 మంది మైనర్లు. ఇవాళ నాగోల్‌లోని కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో వీరందరికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

ఈ కార్యక్రమానికి ఎఫ్ఐఆర్‌ నమోదు చేయబడిన వారితో పాటు కేసులు ఎదుర్కొంటున్న వారిని కుటుంబసభ్యులతో పాటు పిలిచారు. ప్రముఖ ఎన్జీవో సంస్థ భూమిక వుమెన్స్ కలెక్టివ్‌కు చెందిన సైకియాట్రిస్టు డాక్టర్ వాసవి కౌన్సెలింగ్ ఇచ్చారు. 

షీటీమ్స్ అరెస్ట్ చేసిన ముఖ్యమైన కేసులు:

* హైదరాబాద్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక...ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. అయితే ఈమె టెన్త్ క్లాస్‌లో ఉండగా వెంకట్రాములు అనే 35 ఏళ్ల టీచర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు వెంకట్రాములుకు వార్నింగ్ ఇచ్చారు.

కొన్నాళ్లు సక్రమంగానే ఉన్న అతను గత రెండు నెలల నుంచి తిరిగి బాలికను వేధించచడం మొదలుపెట్టాడు. ఆమె సెల్‌ఫోన్‌కు అభ్యంతరకర మేసేజ్‌‌లతో పాటు ‘ఐ లవ్ యూ’, ‘ ఐ మిస్ యూ’ వంటి మేసేజ్‌లు పంపుతున్నాడు.

దీంతో విసిగిపోయిన ఆమె షీ టీమ్స్‌‌కు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంకట్రాములను అరెస్ట్ చేసి  అతనిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

* మరో కేసులో 35 ఏళ్ల మహిళ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ప్రతి రోజు ఆమె స్కూలుకు వెళ్లే సమయంలో ఒక 56 ఏళ్ల వ్యక్తి బైక్‌పై ఆమెను అనుసరించడంతో పాటు అసభ్యకరమైన సైగలు చేసేవాడు.

ఈ క్రమంలో ఈ నెల 13న ఉదయం ఆమె స్కూలుకు వెళ్లేందుకు చైతన్యపురి ఫ్రూట్ మార్కెట్ సమీపంలో బస్టాప్ మీదుగా వెళ్తోంది. రోజూలాగే ఆమెను వెంబడించిన అతను అసభ్యకరమైన సైగలతో పాటు అశ్లీల పదజాలంతో వేధించాడు.

దీంతో ఆమె వెంటనే ఎల్‌బీ నగర్ షీ టీమ్‌కు ఫోన్  చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువకుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతనిని కొమర్రాజు వెంకటేశ్వరరావుగా గుర్తించారు.

ఇతను సరూర్‌నగర్‌ బాబాకృప అపార్ట్‌మెంట్‌లో నివసిస్తూ, ఆటో‌మొబైల్ షాపులో పనిచేస్తున్నట్లు తెలిపారు. వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని రిమాండ్‌కు తరలించారు. 

* ఉప్పల్‌‌కు చెందిన 20 ఏళ్ల యువతి ఈ నెల 21న శీలం శ్రీనివాస్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నట్లుగా షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. మల్కాజ్‌గిరికి చెందిన 32 ఏళ్ల శ్రీనివాస్ మ్యూజిషియన్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరు స్నేహితులు, అయితే కొద్దిరోజుల్లోనే వారు ప్రేమించుకుని త్వరలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

అయితే శ్రీనివాస్ మోసగాడని, అతనికి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందని సదరు యువతి గుర్తించి పెళ్లి ఆలోచనను విరమించుకుంది. అయితే వీరిద్దరూ క్లోజ్‌గా ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని ఫోటోలు శ్రీనివాస్ దగ్గర ఉన్నాయి.

తనను పెళ్లి చేసుకోకుంటే వాటిని మార్ఫింగ్ చేసి నెట్‌లో పెడతానంటూ ఆమెను వేధించసాగాడు. దీంతో ఆమె షీటీమ్స్‌ని ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్ట్  చేసి రిమాండ్‌కు తరలించారు.

డెకాయ్ ఆపరేషన్స్: కుషాయిగూడ బస్టాండ్‌, ఉప్పల్, భరత్ నగర్, అన్నపూర్ణ కాలనీలలో డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించిన మల్కాజ్‌గిరి షీటీమ్స్... కాలేజీ, పాఠశాల విద్యార్ధినులను వేధిస్తున్న ఆకతాయిలను అరెస్ట్ చేశారు. 

బాల్య వివాహాలు: గత ఆరు వారాల్లో భువనగిరి, మల్కాజ్‌‌గిరి, చౌటుప్పల్ ఏరియాల్లో జరుగుతున్న బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు రాచకొండ కమిషనరేట్ తెలిపింది. వీరిని కమిషనర్ మహేశ్ భగవత్ అభినందించారు.

ఆకతాయిలు వేధిస్తున్నా లేదా మరేదైనా ఇబ్బందుల్లో ఉన్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ నెంబర్ 9490617111 లేదా 100 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు  చేయవచ్చని ఉన్నతాధికారులు తెలిపారు. 

click me!