
ఓ వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో ఆయన ప్రస్తుతం చర్లపల్లి సెంట్రల్ జైలులో వున్నారు. అటు బీజేపీ కూడా రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి షోకాజ్ నోటీసులు సైతం జారీ చేసింది. ఈ క్రమంలో రాజాసింగ్ అరెస్ట్‌కు నిరసనగా ఆయన మద్ధతుదారులు శనివారం బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో గోషామహల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ కేసులో అసలు దోషులు మరెవరో కాదని.. మంత్రి కేటీఆర్ అని ఓ సంస్థ మీడియా సమావేశంలో ఆరోపించింది.
మునావర్ ఫారూఖీని హైదరాబాద్‌లో ప్రదర్శనకు అనుమతించడంపై రాజాసింగ్ మద్ధతుదారులు ప్రశ్నించారు. అతనికి పూర్తి స్థాయిలో భద్రత కల్పించి.. ప్రదర్శనకు ప్రభుత్వం ఎలా అనుమతిస్తుందని వారు నిలదీశారు. మునావర్ ఫారూఖీ.. హిందూ దేవతలను అగౌరవపరిచాడని, హిందువుల మనోభావాలను దెబ్బతీశారని శ్రీరామ్ యువసేన అతనిపై మండిపడుతోంది. అంతేకాకుండా మజ్లిస్‌తో టీఆర్ఎస్ ప్రభుత్వం పొత్తు పెట్టుకుందనని వారు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాల్లో వివక్ష చూపిస్తోందని శ్రీరామ్ యువసేన ఫైర్ అయ్యింది. ఒవైసీ పలుమార్లు ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయనపై పీడీ యాక్ట్ ఎందుకు నమోదు చేయలేదని.. కేవలం రాజాసింగ్‌ను మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారని యువసేన ప్రశ్నించింది. మజ్లిస్‌తో చేతులు కలిపి రాష్ట్రంలో ఈ తరహా రాజకీయాలు చేస్తున్నారని యువసేన నేతలు ఆరోపించారు.
మరోవైపు.. రాజాసింగ్‌ను పీడీ యాక్ట్ కింద నిర్బంధించామని, ప్రస్తుతం చర్లపల్లి సెంట్రల్ జైలులో అతనిని వుంచినట్లు హైదరాబాద్ పోలీసులు గురువారం తెలిపారు. రాజాసింగ్‌పై 101 క్రిమినల్ కేసులు నమోదై వున్నాయని.. ఆయనకు 18 మతపరమైన నేరాలలో ప్రమేయం వుందని పోలీసులు పేర్కొన్నారు. హైదరాబాద్ నగర పోలీస్ కమీసనర్ ఆదేశాల మేరకు రాజాసింగ్‌ను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు.
ఇకపోతే... రాజా సింగ్‌పై ఉన్న విద్వేషపూరిత ప్రసంగం ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందులో భాగంగా.. గతంలో రాష్ట్ర అసెంబ్లీలో రాజాసింగ్ చేసిన ప్రసంగాల రికార్డులను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు. ఆ ప్రసంగాల్లో ఉన్న వాయిస్‌ను.. ఆయన ఆగస్టు 22న విడుదల చేసిన వీడియోలోని ఆరోపించిన ద్వేషపూరిత ప్రసంగం వాయిస్‌తో పోల్చిచూడనున్నారు.
ఇందుకోసం.. అసెంబ్లీలో రాజాసింగ్ ప్రసంగాలకు సంబంధించిన రికార్డులను కోరుతూ పోలీసులు గతంలో అసెంబ్లీ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు. ఆరోపించిన ద్వేషపూరిత ప్రసంగం వీడియో క్లిప్పింగ్‌లు యూట్యూబ్ నుంచి తొలగించినప్పటికీ.. పోలీసులు సైంటిఫిక్ టూల్స్ ఉపయోగించి వీడియో క్లిప్‌లను తిరిగి పొందారు. ఆ వీడియో క్లిప్పింగ్‌లను భద్రపరిచారు. ఈ రెండు వీడియోలను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించిన పోలీసులు.. వాయిస్ నమూనాలపై తుది నివేదిక కోసం వేచి చూస్తున్నారు