కెసిఆర్ ఫామ్ హౌస్ లో రైతుల చర్చలేంది ?

First Published Jul 22, 2017, 11:31 AM IST
Highlights
  • కెసిఆర్ ఫామ్ హౌస్ లో చర్చలపై ప్రజాతెలంగాణ అభ్యంతరం
  • రైతులను బెదిరించడం కోసమే ఫామ్ హౌస్ కు పిలుస్తున్నారు
  • గ్రామసభలో  లేదా సచివాలయంలో చర్చలు జరపాలి
  • సిఎం కుట్రలకు బలికావొద్దని ప్రజా తెలంగాణ పిలుపు

మల్లన్న సాగర్ బాధిత రైతులతో కెసిఆర్ ఫామ్ హౌస్ లో చర్చలు జరపడాన్ని ప్రజా తెలంగాణ తప్పు పట్టింది. ఫామ్ హౌస్ చర్చల ద్వారా రైతులను మోసం చేయడానికి సర్కారు కుట్రలు చేస్తోందని ప్రజా తెలంగాణ నేత వేముల ఘాట్ శ్రీశైల్ రెడ్డి ఆరోపించారు. సర్కారు చర్యను నిరసిస్తూ 410 రోజులుగా దీక్ష చేస్తున్న రైతాంగ పోరాటాన్ని భగ్నం చేయడం కోసం ఫామ్ హౌస్ చర్చలకు తెరలేపారని విమర్శించారు.

మల్లన్న సాగర్ లో 410 రోజులుగా దీక్షలు చేస్తున్న ప్రజలకు ప్రజా తెలంగాణ తరుపున శ్రీశైల్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆలేఖ పూర్తి పాఠం ఇదీ....

 

మీ  జీవించే హక్కును హరిస్తున్న మల్లన్న సాగర్ కు వ్యతిరేకంగా కోర్టుల ద్వారా, ప్రజా సంఘాల నిరసన ద్వారా... అన్నిటినీ మించి 410 రోజులుగా గ్రామమంతా కలిసి దీక్ష చేస్తున్నరు. ఈ రోజు మిమ్మల్ని చర్చలకు రమ్మని ఒక ఎస్సై ద్వారా కబురు పెట్టిండు సీఎం కేసీఆర్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చలకు పిలవడం ఆహ్వానించదగినదే. అయితే...ఆ చర్చలు జరగవలసింది సెక్రటేరియట్ లో లేదా ప్రగతి భవన్ లో. అంతే కాని, మీడియా లేకుండా, ప్రజాసంఘాలు లేకుండా, రాజకీయ పార్టీలు లేకుండా, ఒక్కడే గడీలో కూసుని తీర్పు యిస్తా రండి అంటే, అక్కడ జరిగేది మీ మీద దబాయింపుడు మాత్రమే.

నా ప్రియమైన వేములఘాట్ ప్రజలారా, మీరందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అందుకే, మీకు సవినయంగా చెపుతున్నా. ఆ ఎస్సైతో చెప్పండి. వేములఘాట్ గ్రామంలోగానీ, సెక్రటేరియట్ లో గానీ, ప్రగతిభవన్ లో గానీ చర్చలకు వస్తాం అని చెప్పండి. ప్రజా సంఘాల సమక్షంలో, రాజకీయ పార్టీల సమక్షంలో, మీడియా ఉండగా చర్చలు పారదర్శకంగా జరగాలి గానీ, ఈ గడీలకు పిలువనంపుడు వొద్దు అని చెప్పండి.

నాది మీ ఊరు కాదు. నేను అక్కడ పోటీ చేయడం లేదు. మీరూ, మీ లాంటి వేలాది తెలంగాణ పల్లెలు చల్లగా ఉండాలని మాత్రమే నా కోరిక. మరోసారి ఆలోచించండి.

సీఎం కుట్రలకు బలి కావొద్దు. ఒత్తిడిలకు లొంగి వెళ్ళవలసి వచ్చినా, 'కలెక్టివ్ డిమాండ్స్' గురించి మాట్లాడండి. భూమిలేని వారు, కూలీలు, కౌలుదారులు అందరి సమస్యలూ చెప్పండి. అంతిమ నిర్ణయం గ్రామం అంతా కలిసి కూచుని తీసుకుంటాం అని చెప్పి రండి.

 

సదా మీ శ్రేయోభిలాషి

శ్రీశైల్ రెడ్డి వేములఘాట్ , PrajaTelangana

click me!