బట్టలూడేలా కొట్టారు, న్యాయమడిగితే ఇంతేనా: బోరుమన్న తెలంగాణ మహిళా నేతలు

By Nagaraju penumalaFirst Published Oct 12, 2019, 3:35 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు క్రియాశీలక పాత్ర పోషించారని సంధ్య స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి ఇప్పుడు గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. 

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు పీవో డబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ధర్నాలు చేస్తుంటే వారిపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. 

న్యాయం చేయాలంటూ రోడ్డెక్కితే సర్థిచెప్పాల్సిందిపోయి బట్టలూడేలా కొట్టిస్తారా అంటూ మండిపడ్డారు. బస్ భవన్ వద్ద ఆర్టీసీ కార్మికుల పిలుపు మేరకు తెలంగాణ జనసమితి, సీపీఐ, ప్రజా సంఘాలు, ఆర్టీసీ కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి. 

అనంతరం బస్ భవన్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు క్రియాశీలక పాత్ర పోషించారని సంధ్య స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి ఇప్పుడు గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. 

ఆర్టీసీ కార్మికులను విలీనం చేయకపోగా ఉద్యోగాలు కూడా భర్తీ చేయడం లేదని మండిపడ్డారు. ఇప్పటి వరకు వారికి జీతాలు కూడా ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం చర్యలతో విసిగిపోయిన కార్మికులు తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు.  

ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చలు పూర్తికాకుండానే ఎలా కమిటీని రద్దు చేస్తారని మండిపడ్డారు. ఉద్యోగాలు తీసేస్తామంటూ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని విరుచుకుపడ్డారు. ఆర్టీసీనీ ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు సంధ్య. 

click me!