
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమైన పొంగులేటి, జూపల్లిలు.. వారి వారి అనుచరులతో హస్తం పార్టీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు ఏఐసీసీ ప్రధాన కార్యాయలంలో రాహుల్ గాంధీతో పొంగులేటి, జూపల్లి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, మాణిక్ రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి, జానా రెడ్డి, మదుయాష్కీలతో పాటు పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూపల్లి, పొంగులేటిలు.. వారి అనుచరులు రాహుల్‌కు పరిచయం చేశారు. దాదాపు 30 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది.
ఇక, కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అనంతరం జూపల్లి, పొంగులేటిలు.. హస్తం పార్టీలో చేరికకు సంబంధించి ప్రకటన చేయనున్నట్టుగా తెలుస్తోంది. రాహుల్‌తో భేటీ తర్వాత.. ఖమ్మం, మహబూబ్ నగర్‌లో సభలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపైనా స్పష్టత వస్తుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే జులై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పొంగులేటి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా సమాచారం. మరోవైపు నాగర్‌కర్నూలులో సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని జూపల్లి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సభలకు రాహుల్ గాంధీ హాజరవుతారా? లేదా టీ కాంగ్రెస్‌పై ప్రత్యేక దృష్టి సారించిన ప్రియాంక గాంధీ హాజరవుతారా? అనేది కూడా.. జూపల్లి, పొంగులేటి ఢిల్లీ పర్యటన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.