గదిలో వేసి చితకబాదాడని.. యజమానిపై పగ : కూకట్‌పల్లి బస్సుల దహనం కేసులో డ్రైవరే నిందితుడు

By Siva Kodati  |  First Published Feb 15, 2023, 6:47 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కూకట్‌పల్లి భారతి ట్రావెల్ బస్సుల దహనం కేసును పోలీసులు ఛేదించారు. డ్రైవర్ వీరబాబే బస్సులకు నిప్పంటించినట్లుగా గుర్తించారు. 
 


హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో బస్సులు దహనమైన కేసును పోలీసులు ఛేదించారు. డ్రైవర్ వీరబాబే బస్సులకు నిప్పు పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. భారతి ట్రావెల్స్ యజమాని కృష్ణారెడ్డి.. డ్రైవర్‌ను ట్రిప్‌కు వెళ్లాల్సిందిగా ఆదేశించాడు. అయితే దీనికి వీరబాబు ససేమిరా అనడంతో అతనిని గదిలో వేసి చితకబాదారు కృష్ణారెడ్డి. దీంతో యజమానిపై పగపెంచుకున్న వీరబాబు 3 రోజుల క్రితం భారతి ట్రావెల్స్‌కు చెందిన మూడు బస్సులకు నిప్పంటించాడు. గతంలోనూ కృష్ణారెడ్డి, యశ్వంత్ రెడ్డిలతో వీరబాబుకు వివాదం వున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో వీరబాబును అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. 

కూకట్‌పల్లి పరిధిలోని రంగధాముని చెరువు దిగువన ట్రావెల్స్ రోడ్డులో భారతి ట్రావెల్స్‌కు సంబంధించిన డిపో వుంది. అయితే ఆదివారం అర్ధరాత్రి దాటాక మూడు బస్సులు ఒకదాని తర్వాత మరొకటి అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అగ్నిప్రమాదం చోటు చేసుకున్న ప్రదేశంలో సీసీ కెమెరాకు సంబంధించిన వైర్ కట్ చేసి వుండటంతో ఇది ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన ఘటనేనని పోలీసులు అనుమానించారు. ఈ క్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజీని విశ్లేషించగా వీరబాబు కుట్ర బయటపడింది. అగ్నిప్రమాదం కారణంగా భారతి ట్రావెల్స్‌కు రూ.30 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లుగా సమాచారం. 

Latest Videos

click me!