ప్రొ.హరగోపాల్‌పై దేశద్రోహం కేసు .. బెయిల్ పిటిషన్‌తో వెలుగులోకి, మరో 152 మందిపైనా అభియోగాలు

By Siva Kodati  |  First Published Jun 15, 2023, 8:16 PM IST

ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు పోలీసులు. హరగోపాల్‌తో పాటు 152 మందిపై కేసు పెట్టారు. 2022 ఆగస్ట్ 19న తాడ్వాయి పీఎస్‌లో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. 


ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు పోలీసులు. 2022 ఆగస్ట్ 19న తాడ్వాయి పీఎస్‌లో కేసు నమోదైంది. UAPA, ఆర్మ్స్ యాక్ట్‌తో పాటు పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బెయిల్ పిటిషన్ సందర్భంగా కేసును బయటపెట్టారు పోలీసులు. మావోయిస్టులకు సహాయ సహకారాలు అందిస్తున్నారన్న అభియోగాలపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. హరగోపాల్‌తో పాటు 152 మందిపై కేసు పెట్టారు. ప్రజా ప్రతినిధులను చంపడానికి కుట్ర చేశారని ఆరోపించారు. మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్ పేరు వుందంటూ కేసు నమోదు చేశారు. 

దీనిపై ప్రొ. హరగోపాల్ స్పందించారు. మావోయిస్టులు మాలాంటి వారిపై ఆధారపడరని, వాళ్ల ఉద్యమం వేరని అన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అందరిపై రకరకాల కేసుల పెట్టారని, తనపైనా కేసు పెట్టారని హరగోపాల్ అన్నారు. అందరం కలిసి మాట్లాడుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన పిలుపునిచ్చారు. నిజాయితీ గల వారిపై కేసులు పెట్టారని హరగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధమని, అందరిపై కేసులు ఎత్తివేయాలని , ఉపాకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఉపా చట్టం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండాల్సిన చట్టం కాదన్నారు. 

Latest Videos

దేశ ద్రోహం, రాజద్రోహం లాంటి కేసులు పెట్టొద్దని గతంలోనే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని హరగోపాల్ గుర్తుచేశారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంలో ఇలాంటి కేసులు పెట్టడం దురదృష్టకరమన్నారు. చనిపోయినవారిపైనా కేసులు పెట్టారని హరగోపాల్ ఆరోపించారు. పేర్లు రాసుకోవడం కాదు.. సరైన కారణాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపా చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ వాళ్లు.. ఇప్పటికైనా తప్పైందని ఒప్పుకోవాలని హరగోపాల్ డిమాండ్ చేశారు. బాధ్యతారహితంగా కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని హరగోపాల్ మండిపడ్డారు. ఈ కేసులు నిలబడవని ఆయన స్పష్టం చేశారు.  
 

click me!