టీఆర్ఎస్ ఎంపీపై చీటింగ్ కేసు... కోర్టు కీలక ఆదేశాలు

By Arun Kumar PFirst Published Jul 25, 2021, 7:33 AM IST
Highlights

టీఆర్ఎస్ పార్టీ ఎంపీపై చీటింగ్ కేసు నమోదయ్యింది. కోర్టు ఆదేశాలతో వరంగల్ జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.  

వరంగల్: టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్ కు కోర్టు షాకిచ్చింది. ఆయనపై చీటింగ్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించింది. దీంతో ఎంపీతో పాటు మరో ఇద్దరిపై వివిధ సెక్షన్ల కింద హన్మకొండ సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు.  

ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న ప్రకాష్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారు. హంటర్ రోడ్డులోని న్యూశాయంపేటలో గల అల్లూరి ట్రస్ట్, అల్లూరి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌కు ఎంపీ కార్యదర్శిగా వున్నారు. అయితే 2016‌-17, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో ఈ ట్రస్ట్ ఆదాయపన్ను చెల్లింపుల్లో అవకతవకలకు  పాల్పడినట్లు... భారీగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు మల్లారెడ్డి  అనే వ్యక్తి కోర్టును  ఆశ్రయించాడు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన న్యాయస్థానం బండా ప్రకాష్ తో పాటు ఆడిటర్లు అత్తలూరి సత్యనారాయణ, అత్తలూరి వంశీధర్‌ లపై కూడా కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. 

read more  ఎన్నికల్లో డబ్బు పంపిణీ.. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు జైలుశిక్ష

కోర్టు ఆదేశాలతో అధికార పార్టీ ఎంపీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీలోని సెక్షన్లు 409, 417, 120బీ, సీఆర్పీసీలోని సెక్షన్‌ 156(3) కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు కూడా కోర్టు షాకిచ్చింది. ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. 2019 ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేశారన్న కేసులో భాగంగా కోర్టు ఈ తీర్పు వెలువరించింది. మాలోత్ కవితపై 2019లో బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కోర్టు తీర్పు మేరకు రూ.10 వేల జరిమానాను చెల్లించారు ఎంపీ మాలోత్ కవిత. అదే సమయంలో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. 

 
 

click me!