గదికి రావాలంటూ... 70 మంది మహిళలకు ఎర వేసిన మోసగాడు

By telugu news teamFirst Published Feb 3, 2021, 10:22 AM IST
Highlights

అనేక మంది మహిళలు, యువతులను ఆన్‌లైన్‌ ఫ్రెండ్స్‌గా మార్చుకున్నాడు. వారితో కొన్నాళ్ల పాటు యువతి మాదిరిగానే చాటింగ్‌ చేశాడు. 

అతను ఓ యువకుడు.. కానీ సోషల్ మీడియాలో యువతిగా మారిపోయాడు. సోషల్ మీడియాలో యువతి ఫోటోని ప్రొఫైల్ గా పెట్టుకొని.. అమాయక యువతులు, మహిళలకు ఎర వేశాడు. ఈ ముసుగులో వారి బలహీనతల్ని తనకు అనువుగా మార్చుకున్నాడు. అదును చూసుకుని బ్లాక్‌మెయిలింగ్‌ ప్రారంభించాడు. దాదాపు 70 మందిని బాధితులుగా మార్చిన ఈ నిందితుడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడకు చెందిన సుమంత్ మాదాపూర్ లో ఉంటూ అమేజాన్ కష్టమర్ కేర్ విభాగంలో పనిచేస్తున్నాడు. కరోనాతో పనిలేకపోవడంతో.. ఏం చేయాలో పాలుపోక నేరాలు చేయడం మొదలుపెట్టాడు.

యువతి మాదిరిగా ఇన్‌స్ట్రాగామ్‌లో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేశాడు. దీనికి డిస్‌ప్లే పిక్చర్‌గా (డీపీ) ఇంటర్‌నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన ఫొటో పెట్టాడు. దీనిని వినియోగించి అనేక మంది మహిళలు, యువతులను ఆన్‌లైన్‌ ఫ్రెండ్స్‌గా మార్చుకున్నాడు. వారితో కొన్నాళ్ల పాటు యువతి మాదిరిగానే చాటింగ్‌ చేశాడు. ఎదుటి వారు పూర్తిగా తనను నమ్మారని గుర్తించిన తర్వాత అసలు కథ మొదలు పెట్టేవాడు. ఓ దశలో వారి బలహీనతల్ని తనకు అనువుగా మార్చుకుంటూ వారితో సెక్స్‌ చాటింగ్స్‌ చేసేవాడు.

ఇలా కొన్ని రోజుల అనంతరం ఇంటర్‌నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన ఏదో ఒక అమ్మాయి అర్ధ నగ్న ఫోటోలు, నగ్న ఫొటోలను అవతలి వారికి పంపి తనవేనని నమ్మించేవాడు. ఆపై వారినీ అలాంటివే పంపమంటూ ఒత్తిడి చేసేవాడు. సుమంత్‌ వల్లో పడిన అనేక మంది తమ ఫొటోలను కూడా పంపించారు. ఆ ఫొటోలు తన దగ్గరకు వచ్చిందే తడవుగా బ్లాక్‌మెయిలింగ్‌ మొదలెడతాడు. తాను యువకుడిననే విషయం వారితో చెప్పే సుమంత్‌ ఫొటోలు బయటపెడతానంటూ భయపెట్టేవాడు. తనకు మాదాపూర్‌లో రూమ్‌ ఉందని, అక్కడికి వచ్చి కలవాలంటూ చెప్పేవాడు. ఇప్పటి వరకు చాటింగ్స్‌లో చర్చించిన అంశాలను ప్రాక్టికల్‌గా చేయడానికి సహకరించాలని బెదిరించేవాడు.

ఇలా దాదాపు 70 మంది బాధితురాళ్ల ఫొటోలు, స్క్రీన్‌ షాట్స్‌ను తమ ఫోన్‌లో సేవ్‌ చేసుకుని వేధింపులకు పాల్పడ్డాడు. ఎట్టకేలకు ధైర్యం చేసిన ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. 


 

click me!