తెలంగాణలో అంధకారం ఎక్కువ రోజులు ఉండదు.. ప్రజలను దోచుకునే వారిని వదిలిపెట్టబోం: ప్రధాని మోదీ

By Sumanth KanukulaFirst Published Nov 12, 2022, 2:20 PM IST
Highlights

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయబోతున్నామని ప్రధాని మోదీ తెలిపారు. తెలంగాణ అభివృద్దిలో పాల్గొనడానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయబోతున్నామని ప్రధాని మోదీ తెలిపారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కార్యకర్తలతో మాట్లాడాలని కోరారని తెలిపారు. తెలంగాణ అభివృద్దిలో పాల్గొనడానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు వద్ద బీజేపీ ఏర్పాటు చేసిన స్వాగత సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ కార్యకర్తల పనితీరు తనకు కొత్త ఉత్సహాన్ని ఇచ్చిందన్నారు. తాను కూడా మీలాగే చిన్న కార్యకర్తను అని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై బీజేపీ కార్యకర్తలు ధైర్యంగా పోరాడుతున్నారని ప్రశంసించారు. బీజేపీ కార్యకర్తలు ఎవరికి భయపడకుండా పోరాటం చేస్తున్నారని చెప్పారు. 

తెలంగాణ పేరు చెప్పి పార్టీలు పెట్టినవారు పదవులు అనుభవిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు నమ్మకద్రోహం చేస్తున్నారని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు తరలివచ్చారని.. ఒక్క అసెంబ్లీ సీటు తెలంగాణ సర్కార్ మొత్తం మునుగోడుకు పోయిందన్నారు. బీజేపీ కార్యకర్తలు ఎంత గట్టిగా పోరాడారో.. మునుగోడు ఉపఎన్నికను చూస్తే అర్థమవుతోందన్నారు. మునుగోడు ఉపఎన్నికలో ప్రజలు బీజేపీకి ఒక భరోసా ఇచ్చారని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీ సర్కారేనని ప్రజలుచాటి చెప్పారని అన్నారు. తెలంగాణ కమలం వికసించే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. 

తెలంగాణతో బీజేపీకి ప్రత్యేక అనుబంధం ఉందని మోదీ చెప్పారు. 1984 ఎన్నికల్లో తమ పార్టీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకోగా.. అందులో ఒకటి తెలంగాణా నుంచి హన్మకొండ సీటు అని గుర్తుచేశారు. 

ఐటీ హబ్ అయిన హైదరాబాద్‌లో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయని  విమర్శించారు. ఐటీలో ముందున్న రాష్ట్రాన్ని అంధవిశ్వాస శక్తులు పాలిస్తున్నాయని అన్నారు. ఎర్రజెండా నేతలు అభివృద్ది, సామాజిక న్యాయానికి వ్యతిరేకులని విమర్శించారు. అభివృద్ది వ్యతిరేకులతో ఇక్కడి సర్కార్ జత కట్టిందని విమర్శించారు. తెలంగాణలో మూఢనమ్మకాలతో ఏం జరుగుతుందో దేశప్రజలకు తెలియాలని అన్నారు. కేబినెట్‌లో ఎవరిని ఉంచాలి.. ఎవరిని తీసేయాలనేది మూఢనమ్మకాలు నిర్ణయిస్తున్నాయని విమర్శించారు. ఫ్యామిలీ ఫష్ట్ కాదు.. పీపుల్ ఫస్ట్ అనేది బీజేపీ నినాదమని చెప్పారు. తెలంగాణలో అవినీతిరహిత పాలన అందించేందుకు బీజేపీ సిద్దంగా ఉందని చెప్పారు. ప్రజలను లూటీ చేసే ఎవరినీ వదిలిపెట్టేది లేదని తెలిపారు. అవినీతిపరులంతా ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

నలువైపులా చీకట్లు చుట్టుముట్టినప్పుడు వాటిని చీల్చి వెలుగులు చిమ్ముతూ కమలం వికసిస్తుందని చెప్పారు. తెలంగాణలో అంధకారం పోవడానికి ఎక్కువ సమయం పట్టదని.. కమలం వికసిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రతి  పోలింగ్ బూత్‌కు వెళ్లండి.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. 

click me!