పెండింగ్ ట్రాఫిక్ చలానాలు కట్టేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్.. మొత్తం ఎంతో తెలుసా..?

Siva Kodati |  
Published : Jun 19, 2022, 10:04 PM IST
పెండింగ్ ట్రాఫిక్ చలానాలు కట్టేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్.. మొత్తం ఎంతో తెలుసా..?

సారాంశం

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు .. పెండింగ్ చలానాలు వున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ కారును వదిలిపెట్టారంటూ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన వాహనాలపై వున్న అన్ని పెండింగ్ చలానాలను క్లియర్ చేశారు.   

తన వాహనాలపై వున్న అన్ని పెండింగ్ చలానాలను మాజీ మంత్రి , టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ క్లియర్ చేశారు. మొత్తం 5 వాహనాలకు సంబంధించి నమోదైన 66 చలాన్లకు గాను రూ. 37,365ను నాగేందర్ చెల్లించారు. ఇందులో నిన్న వార్తల్లోకెక్కిన టీఎస్ 09 ఎఫ్ ఏ 0999 కారుపై వున్న 8 చలాన్లకు సంబంధించి నమోదైన రూ.5,175 కూడా వుంది. ఈ మేరకు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. 

కాగా.. రిజిస్ట్రేషన్ లేని వాహనాలు, బ్లాక్ ఫిల్మ్స్ పై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (hyderabad traffic police) . దీనిలో భాగంగా శనివారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (danam nagender) కారు అటుగా వచ్చింది. అయితే టీఆర్ఎస్ (trs) ఎమ్మెల్యే వాహనం అని చెప్పగానే వదిలేశారు పోలీసులు. కారుపై 5వేల రూపాయల చలాన్లు ఉన్నా కూడా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. అయితే ట్రాఫిక్ వైలేషన్స్ చేసిన వాహనాలు సీజ్ చేసి దానం నాగేందర్ వెహికల్ మాత్రం వదిలేయడంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఆ మరుసటి రోజే దానం తన పెండింగ్ ట్రాఫిక్ చలానాలు క్లియర్ చేయడం కొసమెరుపు.

మరోవైపు.. ఇటీవల యాదాద్రి జిల్లా (yadadri district) వంగపల్లిలో ట్రాఫిక్‌ పోలీసుల ఓవరాక్షన్‌కు ఓ చిన్నారి మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో వున్న చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్తున్న కారును ఆపిన పోలీసులు వాహనంపై ఉన్న రూ. వెయ్యి చలానా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బాబును ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని వేడుకున్నా కనికరించకుండా అరగంటపాటు వాహనాన్ని పోలీసులు కదలనివ్వలేదు. దీంతో మూడు నెలల చిన్నారి పరిస్థితి విషమించింది. ఆసుపత్రికి చేరడానికి ఆలస్యం కావడంతో బాబు మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు గుండె చెరువయ్యేలా రోధిస్తున్నారు.

జనగామకు చెందిన దంపతులకు మూడు నెలల కిందటే కుమారుడు జన్మించాడు. బాబుకి అనారోగ్యంగా ఉండటంతో అద్దె కారు మాట్లాడుకుని హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నారు. అయితే వంగపల్లి వద్ద కారును ఆపిన ట్రాఫిక్ పోలీసులు వాహనంపై వెయ్యి రూపాయల చలానా ఉందని తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ గొడవలో పోలీసులు వాహనాన్ని అరగంట పాటు ఆపడంతో బాబు మృతి చెందినట్లు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసులు మాత్రం మరోలా వాదిస్తున్నారు. కారులోని వ్యక్తులు సీటుబెల్టు ధరించకపోవడాన్ని గమనించి వాహనాన్ని ఆపామని ... బాబుకు సీరియస్‌గా ఉన్న విషయాన్ని ఎవరూ చెప్పలేదని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఓ చిన్నారి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయి.. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. 

 


 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్