కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వైఖరి బాధ కలిగిస్తోందని మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వైఖరి బాధ కలిగిస్తోందని మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాను సొంత అన్నగా భావించానని చెప్పారు. ప్రచారానికి రావాలని వేడుకున్నట్టుగా తెలిపారు. ఆడబిడ్డగా మునుగోడులో ఒంటరి పోరాటం చేస్తున్నాని చెప్పారు. మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని ధీమా వ్యక్తం చేశారు. ఇక, మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా తనను ప్రకటించిన అనంతరం పాల్వాయి స్రవంతి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసి తన తరఫున ప్రచారం చేయాల్సిందిగా కోరారు. ఆ సమయంలో స్రవంతి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారానికి వస్తానని చెప్పారని అన్నారు.
ఇటీవల కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని స్రవంతి కలిశారు. మునుగోడులో కాంగ్రెస్ తరఫున ప్రచారానికి రావాల్సిందిగా కోరారు. మునుగోడు ప్రచారానికి వచ్చే విషయమై ఆలోచిస్తానని వెంకట్ రెడ్డి తనకు చెప్పారని స్రవంతి ఇటీవలనే మీడియాకు చెప్పారు. స్రవంతి తల మీద కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేయి పెట్టి ఆశీర్వదిస్తున్న ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే గత రెండు రోజులుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. శుక్రవారం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిదిగా చెబుతున్న ఆడియో లీక్ అయింది. లీకైన ఆడియో టేప్ ప్రకారం.. వెంకట్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ సానుభూతిపరుడైన ఓ వ్యక్తితో మాట్లాడుతూ.. పార్టీ చూడకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కోరారు. చావైనా, పెళ్లైనా రాజగోపాల్ రెడ్డి సాయం చేస్తాడని అన్నారు. ఉపఎన్నికల తర్వాత తాను పీసీసీ చీఫ్‌గా ఎన్నికై, పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని చెప్పారు. అప్పుడు అందరిని జాగ్రత్తగా చూసుకుంటానని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో చేసిన కామెంట్స్.. కాంగ్రెస్ పార్టీలో మరింత కలకలం రేపుతున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన అభిమానులతో మాట్లాడుతూ.. మునుగోడులో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని చెప్పారు. తాను మునుగోడులో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసినా ఉపయోగం ఉండదని అన్నారు. మహా అయితే 10 వేల ఓట్లు వస్తాయని ఆయన అన్నారు. ఓడిపోయే పార్టీకి ప్రచారం చేయడమెందుకని ప్రశ్నించారు. రెండు అధికార పార్టీలు కొట్లాడుతున్నప్పుడు మనమేం చేయగలమని అన్నారు. పాదయాత్ర చేద్దామని అనుకున్నానని.. కానీ కాంగ్రెస్‌లో ఒక్కొక్కరిది ఒక్కొక్క గ్రూప్ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఫైనాన్సియల్ గా చాలా బలహీనంగా ఉందని.. తాను ప్రచారానికి వెళ్తే డబ్బులు ఎవరు పెట్టాలని ప్రశ్నించారు. 25 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని.. ఇక చాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం కాంగ్రెష్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన వ్యతిరేక వర్గం అధిష్టానాన్ని కోరుతుంది.