మునుగోడు బై పోల్ 2022: రేవంత్ రెడ్డితో పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి భేటీ..

By Sumanth KanukulaFirst Published Sep 10, 2022, 1:38 PM IST
Highlights

మునుగోడు ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ వేగంగా పావులు కదుపుతుంది. మునుగోడు ఉపఎన్నికకు తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, నేడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. 

మునుగోడు ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ వేగంగా పావులు కదుపుతుంది. మునుగోడు ఉపఎన్నికకు తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకపోయినప్పటికీ.. అభ్యర్థి ఎంపిక విషయంలో ఆలస్యం పార్టీకి నష్టం చేకూరుస్తుందనే అభిప్రాయంలో కాంగ్రెస్ అధిష్టానం ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసింది. పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టికెట్ ఆశించిన భంగపడిన నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు. వారిని బుజ్జగించడంతో.. కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం పనిచేయాల్సిందిగా కోరనున్నారు. 

ఈ క్రమంలోనే నేడు రేవంత్ రెడ్డితో పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కోసం కలిసి పనిచేయాలని రేవంత్ రెడ్డి.. ఇరువురు నేతలకు సూచించినట్టుగా తెలుస్తోంది. అంతర్గత సమస్యలు లేకుండా.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా చలమల కృష్ణారెడ్డిని రేవంత్ రెడ్డి బుజ్జగించినట్టుగా తెలుస్తోంది. మునుగోడు టికెట్ ఆశించిన పల్లె రవి, కైలాష్ నేత‌తో కూడా రేవంత్ మాట్లాడనున్నట్టుగా తెలుస్తోంది. 

ఇక, మునుగోడు టికెట్ రావడం అదృష్టంగా భావిస్తున్నట్టుగా పాల్వాయి స్రవంతి చెప్పారు. అసలైన కార్యకర్తలు ఎవరూ పార్టీని వీడటం లేదని అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షలాంటిదని.. దీనిని ఒక బాధ్యతగా తీసుకుని ముందుకు సాగుతానని చెప్పారు.  

Also Read: టికెట్ ఆశించిన ఆ ముగ్గురు నా గెలుపునకు కృషి: పాల్వాయి స్రవంతి

మునుగోడు ఉప ఎన్నికపై చర్చించేందుకు ఈరోజు సాయంత్రం గాంధీభవన్‌లో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మునుగోడు ఉపఎన్నిక ప్రచారం సరళి, అనుసరించాల్సిన వ్యుహంపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా మునుగోడు కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఆహ్వానం పంపారు. 

ఇక, మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు చలమల కృష్ణారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయడంతో పాటు.. టికెట్ కోసం పార్టీ ముఖ్య నేతల వద్ద తనవంతు ప్రయత్నం చేశారు.  ఈ ఎన్నికల్లో పోటీ  చేయడానికి ఆర్ధిక అంశాలు కూడా కీలకమనే అభిప్రాయం కూడ పార్టీ వర్గాల్లో నెలకొంది. దీంతో చలమల కృష్ణారెడ్డి వైపు కొందరు నేతలు మొగ్గు చూపారు. కానీ, నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పాల్వాయి స్రవంతి వైపే అధిష్టానం  మొగ్గు చూపింది.
 

click me!