హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడి: టీఆర్ఎస్ అభ్యర్థిగా టెక్కీ పాకాల శ్రీకాంత్ రెడ్డి?

By telugu teamFirst Published Jul 23, 2021, 2:16 PM IST
Highlights

హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఎవరూ ఊహించని అభ్యర్థిని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఓ ఎన్నారై పేరును టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు సమాచారం.

హైదరాబాద్: హుజూరాబాద్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అభ్యర్థిగా ఎన్నారై పాకాల శ్రీకాంత్ రెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన పేరును పరిశీలించి ఖరారు చేసినట్లు చెబుతున్నారు. 

పలువురి పేర్లను పరిశీలించిన తర్వాత కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చి సాఫ్ట్ వేర్ వృత్తిలో ఉన్న శ్రీకాంత్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు చెబుతున్నారు. పాకాల శ్రీకాంత్ రెడ్డి వీణవంక మండలానికి ఆనుకుని ఉన్న అన్నారం గ్రామం. ఆయన స్థాపించిన సాఫ్ట్ వేర్ కంపెనీ సునేరా టెక్నాలజీ దేశవిదేశాల్లో పలువురికి ఉపాధి కల్పిస్తోంది. 

పాకాల శ్రీకాంత్ రెడ్డి కుటుంబానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంచి పేరు ఉంది. దాన్ని పరిగణనలోకి తీసుకుని శ్రీకాంత్ రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేసినట్లు చెబుతున్నారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ కు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. 

ప్రస్తుతం ఈటల రాజేందర్ బిజెపిలో ఉన్నారు. హుజూరాబాద్ నుంచి బిజెపి అభ్యర్థిగా ఆయనే పోటీ చేసే అవకాశాలున్నాయి. లేదంటే ఆయన భార్య జమున పోటీకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. పాదయాత్ర కూడా చేపట్టారు. ఆయన సతీమణి జమున ఇంటింటికి వెళ్లి ప్రచారం సాగిస్తున్నారు. పైగా, ఈటల రాజేందర్ మీద నియోజకవర్గంలో సానుభూతి ఉందని అంచనా వేస్తున్నారు. 

click me!