కేసీఆర్ కేబినెట్లో ఆమెకు అవకాశంపై చర్చ

By Nagaraju TFirst Published Dec 11, 2018, 5:15 PM IST
Highlights

తెలంగాణలో మరోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కూటమి అంచనాలను తలకిందులు చేస్తూ కేసీఆర్ సీఎంగా రెండో సారి ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు. అయితే ఈ సారి కేసీఆర్ కేబినేట్ లో బెర్త్ లు ఎవరికి కేటాయించబోతున్నారా అన్న అంశంపై జోరుగా చర్చజరగుతుంది.  

హైదరాబాద్: తెలంగాణలో మరోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కూటమి అంచనాలను తలకిందులు చేస్తూ కేసీఆర్ సీఎంగా రెండో సారి ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు. అయితే ఈ సారి కేసీఆర్ కేబినేట్ లో బెర్త్ లు ఎవరికి కేటాయించబోతున్నారా అన్న అంశంపై జోరుగా చర్చజరగుతుంది.  

ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నలుగురు ఈ ముందస్తు ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందారు. టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డి, చందూలాల్ లు ఓటమి పాలవ్వడం ఆపార్టీకి విస్మయానికి గురి చేసింది. 

వీరితో పాటు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనా చారి కూడా పరాజయం పాలయ్యారు. దీంతో ఖాళీ అయిన పదవులను ఎవరికి కట్టబెడతారా అన్న అంశం ఆసక్తికరంగా మారింది. 
ముఖ్యంగా స్పీకర్‌గా టీఆర్‌ఎస్ ఎవరిని సిఫారసు చేయనుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. 

ఇకపోతే టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మొదటి నుంచి కేబినెట్‌లో మహిళలకు స్థానం కల్పించలేదనే విమర్శ ఉంది. కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్నికల ప్రచారంలో ఈ అంశంపైనే ఫోకస్ చేసింది.  ప్రతిపక్ష పార్టీల విమర్శలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈసారి కేబినేట్ లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తారంటూ ప్రచారం జరుగుతుంది. 

మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తే మెదక్ నుంచి గెలిచిన పద్మా దేవేందర్‌రెడ్డికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మంత్రిగా అవకాశం కల్పించకపోయినా స్పీకర్ పదవి అయినా ఇస్తారని జోరుగా చర్చ జరుగుతుంది. 

ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసి అనుభవం ఉన్న పద్మాదేవెందర్ రెడ్డిని స్పీకర్ పోస్టుకు సిఫారసు చేస్తారని మరోవాదన కూడా ఉంది. పద్మాదేవెందర్ రెడ్డి ఆది నుంచి కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు సీఎం కేసీఆర్ ఎలాంటి పదవి కట్టబెడతారా అంటూ చర్చ హాట్ హాట్ గా కొనసాగుతోంది. 

ఇకపోతే ఈ ఎన్నికల్లో పలువురి మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. అలాగే మరికొందరికి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే కొత్తవారిని ప్రోత్సహించే విధంగా కేసీఆర్ ఈసారి కేబినెట్ లో కొత్తవారికి అవకాశం కల్పిస్తారంటూ ప్రచారం జరుగుతుంది. 

click me!