కౌశిక్ రెడ్డి కారు ప్రయాణం కరారు.. రేపే ముహూర్తం.. !

By AN TeluguFirst Published Jul 20, 2021, 1:55 PM IST
Highlights

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు.  సీఎం కేసీఆర్ ఈటెలకు అనేక అవకాశాలు వచ్చారని, ఏడేళ్లలో ఈటల రాజేందర్ హుజురాబాద్ లో ఏం చేయలేదని మండిపడ్డారు. 

హైదరాబాద్ : హుజురాబాద్ నేత పాడి కౌశిక్ రెడ్డి రేపు (బుధవారం) టిఆర్ఎస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు.  సీఎం కేసీఆర్ ఈటెలకు అనేక అవకాశాలు వచ్చారని, ఏడేళ్లలో ఈటల రాజేందర్ హుజురాబాద్ లో ఏం చేయలేదని మండిపడ్డారు.  వ్యక్తిగత అభివృద్ధికే ఈటెల ప్రాధాన్యత ఇచ్చారన్నారు.  ఈటలది ఆత్మగౌరవం కాదని హుజురాబాద్ ప్రజలది ఆత్మగౌరవమని గుర్తు చేశారు. దళితబంధు అద్భుతమైన పథకం అని అన్నారు.

ఈటెల కు డిపాజిట్ కూడా దక్కదు అన్నారు.  ఈటెల రాజేందర్ హత్యా రాజకీయాలు చేస్తారని, 2018 లో  కమలాపురం మండలం మర్రిపల్లిగూడెంలో తనను హత్య చేసేందుకు యత్నించారని మండిపడ్డారు.  హత్యా రాజకీయాల చరిత్ర ఈటెలదేనని దుయ్యబట్టారు.  రేవంత్ రెడ్డి తనతో అన్ని పనులు చేయించుకుని మోసం చేశాడు అన్నారు.

‘సొంత తమ్ముడు అని చెప్పావు కదా రేవంత్ అన్నా.. ఆ మాట గుండె మీద చేయి వేసుకుని చెప్పాల’ని అన్నారు.  రేవంత్ రెడ్డి ది తొందరపాటు చర్యలని, తెలంగాణలో కాంగ్రెస్ ఖతం అవుతుందని కౌశిక్ రెడ్డి అన్నారు.

ఇటీవల ఫోన్ సంభాషణ లీక్ అయిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన టీఆర్ఎస్ లో చేరతారని, ఎమ్మెల్యే అభ్యర్థి ఆయనేనని వార్తలు వచ్చాయి.  అయితే ఎల్‌.రమణతో పాటు టీఆర్ఎస్లో చేరుదామని  భావించిన కౌశిక్ రెడ్డి కొన్ని కారణాలతో ఆగిపోయినట్లు తెలుస్తోంది.

మరోవైపు హుజూరాబాద్‌ టీఆర్ఎస్ అభ్యర్థిపై నెలకొన్న ఉత్కంఠ వీడడం లేదు. కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరినప్పటికీ ఆయనకు టిఆర్ఎస్ టికెట్ ఇస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే హుజురాబాద్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుపే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తోంది. బలమైన  అభ్యర్థి కోసం వేచి చూస్తోంది.

ఈ క్రమంలోనే అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్రతో ఎన్నికల సమరానికి సై అంటున్నారు. ఇదిలా ఉండగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన్ని టిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దించుతుందని ఊహాగానాలు జోరందుకున్నాయి.

click me!