ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందని, ఇందులో అనుమానమేమీ లేదని, రాసి పెట్టుకోండని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రజలకు చేసే మంచి పనుల గురించి ఈ నెల 17న హైదరాబాద్‌లో సోనియా గాంధీ వెల్లడిస్తారని వివరించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ ఖమ్మంలో వేగంగా బలోపేతం అవుతున్నది. బలమైన నేత పొంగులేటి కూడా పార్టీలో చేరడంతో ఇది వరకే ఖమ్మం నుంచి క్రియాశీలకంగా పని చేస్తున్న కాంగ్రెస్ నేతలకు కలిసొచ్చింది. ఇతర పార్టీల నుంచి హస్తం పార్టీలోకి క్యాడర్ స్థాయి నేతల వలసలు పెరిగాయి. ముదిగొండ మండలం వెంకటాపురంలో సోమవారం రాత్రి కాంగ్రెస్‌లోకి నేతలను ఆహ్వనిస్తున్న కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు పాల్గొని మాట్లాడారు.
బీఆర్ఎస్ చెప్పేటివి నీతులంటా.. కాంగ్రెస్ చెప్పేటివన్నీ అబద్ధాలంటా అంటూ అధికార పార్టీపై పొంగులేటి విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయాలనే విషయాలపై సోనియా గాంధీ ఈ నెల 17న హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో వెల్లడిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పని చేస్తుందని, అందుకే భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలని పిలుపు ఇచ్చారు. బీఆర్ఎస్, సీపీఎం, బీజేపీల నుంచి కొత్తగా వచ్చే నేతలను కలుపుకుని ముందుకు పోవాలని సూచించారు.
Also Read: డి శ్రీనివాస్ పరిస్థితి విషమం... ఐసియూలో చికిత్స : హెల్త్ బులెటిన్ విడుదల
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని భట్టి విక్రమార్క అన్నారు. పదికి పది సీట్లు గెలుస్తాం రాసి పెట్టుకోండని చెప్పారు. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని, అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలా మంది ఆసక్తితో ఉన్నారని వివరించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు రాజకీయ పునరేకీకరణ జరుగుతున్నదని తెలిపారు.