డి శ్రీనివాస్ పరిస్థితి విషమం... ఐసియూలో చికిత్స : హెల్త్ బులెటిన్ విడుదల

By Arun Kumar P  |  First Published Sep 12, 2023, 1:16 PM IST

సీనియర్ రాజకీయ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించి ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఐసియూలో చికిత్స పొందుతున్నారు. 


హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ పిసిసి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయనను ఐసియూలో వుంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు డి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన బులెటిన్ కు కూడా హైదరాబాద్ సిటి న్యూరో హాస్పిటల్ వైద్యులు విడుదల చేసారు. డీఎస్ పరిస్థితి కుటుంబసభ్యులు, సన్నిహితులు, అభిమానుల్లో ఆందోళన రేపుతోంది. 

నిన్న(సోమవారం) మధ్యాహ్న డి శ్రీనివాస్ తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చేరినట్లు సిటి న్యూరో హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డా రత్న కిషోర్ తెలిపారు.వయసు మీద పడటంతో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడతున్న డీఎస్ శ్వాస తీసుకోడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఆయన శరీరంలో చాలా అవయవాలు పనిచేయడం లేదని... పరిస్థితి అత్యంత సీరియస్ గా వుందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఐసియూలో వుంచి చికిత్స అందిస్తున్నట్లు సిటి న్యూరో హాస్పిటల్ వైద్యులు ప్రకటించారు. 

Latest Videos

తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఎక్స్(ట్విట్టర్) వేదికన స్పందించారు. 'మా నాన్న డి. శ్రీనివాస్ గారు తీవ్ర అస్వస్థతకు గురి కావడం వల్ల ఈ రోజు మధ్యాహ్నం హాస్పిటల్ లో అడ్మిట్ చేయడం జరిగింది' అంటూ అరవింద్ ట్వీట్ చేసారు. 

ఇదిలావుంటే అనారోగ్య కారణాలతో చాలాకాలంగా డిఎస్ రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. అయితే ఇటీవల పెద్దకొడుకు సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా గాంధీ భవన్ లో కనిపించారు. దీంతో డీఎస్ కూడా బిఆర్ఎస్ పార్టీని వీడి తిరిగి సొంతగూటికి చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత డి శ్రీనివాస్ భార్య తన భర్త ఏ పార్టీలో చేరడంలేదని... ఈ వయసులో ఆయనను రాజకీయాల్లోకి లాగవద్దంటూ ఓ ప్రకటన విడుదల చేసారు. 

click me!