ఓయూలో ఫీజుల పెంపుపై వీసీ వింత వాదన.. విద్యార్థుల ఆగ్రహం..!

Published : Apr 23, 2023, 04:51 PM IST
ఓయూలో ఫీజుల పెంపుపై వీసీ వింత వాదన.. విద్యార్థుల ఆగ్రహం..!

సారాంశం

ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో పీహెచ్‌డీ కోర్సు ఫీజుల పెంపుపై గత కొద్ది రోజులుగా వర్సిటీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి  తెలిసిందే. ఎటువంటి హేతుబద్దత లేకుండా పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో పీహెచ్‌డీ కోర్సు ఫీజుల పెంపుపై గత కొద్ది రోజులుగా వర్సిటీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి  తెలిసిందే. ఎటువంటి హేతుబద్దత లేకుండా పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫీజుల విషయంపై యూనివర్సిటీ అధికారులను కలిస్తే పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారని మండిపడుతున్నారు. తాజాగా ఈ విషయంలో ఓయూ వైస్ చాన్స్‌లర్ రవీందర్ తీరును ఏఐఎస్‌ఎఫ్‌-ఓయూ కార్యదర్శి, రీసెర్చ్ స్కాలర్ నెల్లి సత్య‌తో పాటు పలువురు పరిశోధక విద్యార్థులు తప్పుబట్టారు.

ఫీజుల విషయంపై కలిసినప్పుడు వీసీ రవీందర్ పొంతన లేని సమాధానం ఇస్తున్నారని.. ఎల్‌కేజీ ఫీజు లక్ష రూపాయలు ఉందని చెబుతున్నారని ఆరోపించారు. ఏ ప్రభుత్వ పాఠశాలలో ఎల్‌కేజీ ఫీజు లక్ష రూపాయలు ఉందో నిరూపణ చేస్తారా? అని ప్రశ్నించారు. 15 ఏళ్లుగా యూనివర్సిటీలో ఫీజులు పెంచలేదని.. ఇప్పుడు హఠాత్తుగా ఫీజులు ఎందుకు పెంచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెంచిన ఫీజులు కోర్స్ ఫీజా? ట్యూషన్ ఫీజా? అని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. పెంచిన ఫీజులు ప్రభుత్వం చెల్లిస్తుందని చెబుతున్నారని.. అలాంటి అందుకు సంబంధించిన జీవో చూపించాలని డిమాండ్ చేశాన్నారు. ప్రభుత్వమే ఫీజు చెల్లించినప్పుడు తమ వద్ద నుంచి డబ్బులు ఎందుకు వసూలు చేయడమని ప్రశ్నించారు. 

ఉస్మానియా యూనివర్సిటీ అనేది ప్రైవేట్ లిమిటెడ్ కాదని.. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేనని  డిమాండ్ చేశారు. అలా కాకుండా విద్యార్థుల టార్గెట్ చేయడం సరైన పద్దతి కాదన్నారు. 

అదే సమయంలో తనవల్ల విద్యార్థులు నష్టపోయారని వీసీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని నెల్లి సత్య‌ అన్నారు. వీసీ రవీందర్ గతంలో తన గురువు అని.. ఆయన సూచనల మేరకే తాను డబుల్ పీజీ ఆలోచన మానుకుని.. పీహెచ్‌డీ మాత్రమే చదువుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తాను 2018లో పీజీ పూర్తి చేసిన తర్వాత బయటే ఉంటూ చదవుకున్నానని తెలిపారు. నాలుగేళ్ల తర్వాత నిరీక్షణ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో 2022 ఆగస్టులో ఇచ్చిన నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకున్నానని.. ఓవరాల్‌గా ఇందులో తనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పారు. అయితే దేశంలో ఏ యూనివర్సిటీలో లేని విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఫీజులు నిర్ణయిస్తే తమ లాంటి పేద విద్యార్థులు ఎలా చదువుకుంటారని ప్రశ్న తలెత్తుతుందని చెప్పారు. యూనివర్సిటీ తీసుకునే విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలపై పోరాడుతూనే ఉంటానని చెప్పారు. వీసీ రవీందర్ తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తన డాక్టోరల్ ప్రోగ్రామ్ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే