ఓయూ వీసీ తీరు సరికాదు.. ఖండించిన పొన్నం.. హుజురాబాద్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశం

Published : May 02, 2022, 06:50 PM IST
ఓయూ వీసీ తీరు సరికాదు.. ఖండించిన పొన్నం.. హుజురాబాద్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశం

సారాంశం

రాహుల్ గాంధీ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ వీసీ అనుమతి ఇవ్వకపోవడం సరికాదని, ఆయన తీరును ఖండిస్తున్నట్టు పొన్నం ప్రభాకర్ అన్నారు. అరెస్టు చేసిన కాంగ్రెస్ నేతలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు.  

హైదరాబాద్: రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు చురుకుగా సదస్సులు, సమావేశాలు చేపడుతున్నారు. పార్టీ కార్యకర్తలతో టచ్‌లోకి వస్తున్నారు. ఈ తరుణంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీలు కరీంనగర్‌లోని హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాహుల్ ఉస్మానియా యూనివర్సిటీ సమావేశానికి అనుమతి నిరాకరణ అంశంపై మాట్లాడారు.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ తన తెలంగాణ పర్యటనలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో నిర్వహించ తలపెట్టిన సమావేశానికి అనుమతి ఇవ్వకపోవడంపై పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రాహుల్ సభకు అనుమతి ఇవ్వని ఓయూ వీసీ తీరు సరికాదని అన్నారు. ఓయూ వీసీ తీరును ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ అనుమతి నిరాకరణ నేపథ్యంలో కాంగ్రెస్ నిరసను చేస్తే పలువురు   కార్యకర్తలను అరెస్టు చేశారని, వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ అంటేనే రైతులు అని, రైతుల వెంటే కాంగ్రెస్ ఉంటుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులు, నేత కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని వివరించారు. అలాగే, రాహుల్ గాంధీ తన తెలంగాణ పర్యటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డొల్ల తనం, వారి హయాంలో నిరుద్యోగ అంశంపై మాట్లాడతారని తెలిపారు. రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు. 

ఇదే సమావేశంలో షబ్బీర్ అలీ కూడా మాట్లాడారు. తెలంగాణ బిల్‌ను అడ్డగోలుగా పాస్ చేశారని, విభజన తప్పుగా చేశారని ప్రధాని మోడీ అన్నారని, ఆయన తన వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై ప్రేమతో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విభజించిందని వివరించారు. తెలంగాణ సాధన కోసం పొన్నం ప్రభాకర్ ఎంతో పోరాడారని తెలిపారు. తెలంగాణపై నోరు పారేసుకున్న నరేంద్ర మోడీపై టీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. వారికి సిగ్గులేదని ఆగ్రహించారు. బండి సంజయ్ ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నారని అన్నారు.

PREV
click me!

Recommended Stories

Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్
IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!