ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన కేసులో నిందితుల విడుదలకు ఆదేశాలు.. రిమాండుకు నిరాకరణ..

By SumaBala Bukka  |  First Published Oct 28, 2022, 6:57 AM IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించిన కేసులో అరెస్టైన ముగ్గుర నిందితులను విడుదల చేయాలని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.


హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను  ప్రలోభ పెట్టిన కేసులో  సరైన ఆధారాలు లేవంటూ ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిరాకరించారు.  వారిని తక్షణమే విడుదల చేయాలని, 41 సిఆర్ పీసి కింద నోటీసులు ఇచ్చిన తర్వాతే విచారించాలని స్పష్టం చేశారు.  నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ లను పోలీసులు గురువారం రాత్రి సరూర్ నగర్ లోని న్యాయమూర్తి జీ.రాజగోపాల్ నివాసానికి తీసుకువెళ్లి ఆయన ఎదుట హాజరుపరిచారు.

సొమ్ము దొరకనందున ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం ( పీసీ యాక్ట్) వర్తించదు అని స్పష్టం చేశారు. న్యాయమూర్తి ఆదేశాల నేపథ్యంలో నిందితులను విడిచిపెట్టమని శంషాబాద్ డిసిపి  జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు. టిఆర్ఎస్ కు చెందిన తాండూరు, అచ్చంపేట, కొల్లాపూర్, పినపాక ఎమ్మెల్యే పైలెట్  రోహిత్ రెడ్డి,  గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావులను  ప్రలోభపెట్టారని ముగ్గురు నిందితులపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం రాత్రి వరకు ముమ్మరంగా దర్యాప్తు జరిగింది. నిందితులు రూ. కోట్ల నగదు తీసుకొచ్చారని ప్రచారం జరిగినా దానికి సంబంధించిన ఆధారాలను పోలీసులు వెల్లడించలేదు. కానీ జాతీయ స్థాయిలో కీలక నాయకుడు మాట్లాడిన ఆడియో టేపులు లభించాయని పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Latest Videos

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు: స్పెషల్ ఇన్వేస్టిగేషన్‌కై హైకోర్టులో బీజేపీ పిటిషన్

ఎమ్మెల్యేలను ఒప్పించాలని రోహిత్ రెడ్డికి ప్రలోభం..
రోహిత్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అభియోగాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి అలియా సతీష్ శర్మ, హైదరాబాద్కు చెందిన నందకుమార్ సెప్టెంబర్ 26న తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కలిశారు. టిఆర్ఎస్ కు రాజీనామా వచ్చే సాధారణ ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేస్తే రూ.100కోట్ల నగదు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే కాంట్రాక్టు విధిస్తామని ఆశపెట్టారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత స్థానానికి తీసుకు వెళ్తామన్నారు. బీజేపీలో చేరక పోతే ఈడి,  సిబిఐ ఇలాంటి దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించి క్రిమినల్ కేసులు పెట్టిస్తామని హెచ్చరించారు. టిఆర్ఎస్ ను తాము తుదముట్టించబోతున్నామని పేర్కొన్నారు.

వారిద్దరూ బుధవారం ఉదయం మరోసారి రోహిత్ రెడ్డి కి ఫోన్ చేశారు. తిరుపతికి చెందిన సింహయాజీ స్వామితో కలిసి తాము మధ్యాహ్నం మొయినాబాద్ సమీపంలోని అజీజ్ నగర్ లోని రోహిత్ రెడ్డి ఫామ్హౌస్కు వస్తున్నామని,  ఇంకా ఎవరైనా ఎమ్మెల్యేలు ఉంటే తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్యేలు ఎవరైనా బిజెపిలో చేరేందుకు ఒప్పుకుంటే రూ. 50 కోట్లు ఇస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలను ఒప్పించడం ద్వారా టిఆర్ఎస్ పార్టీని అస్థిరపరిచడానికి సహకరించాలని కోరారు. భారీ మొత్తంలో లంచం ఇవ్వజూపిన ఈ అనైతిక చర్యను అడ్డుకోవడానికి..  ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని  రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురు నిందితులపై  120-బి( నేరపూరిత కుట్ర), రెడ్ విత్ 171-ఈ 506 ( నేరపూరిత బెదిరింపు) రెడ్ విత్ 34 ఐపీసీ,  సెక్షన్ 8 ఆఫ్  ప్రివెన్షన్  ఆఫ్ కరప్షన్ యాక్ట్-1988 ( ప్రభుత్వ ప్రతినిధికి లంచం ఇవ్వజూపడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

click me!