మునుగోడు ఉపఎన్నిక.. టీఆర్ఎస్‌పై బీజేపీ న్యాయపోరాటం, ఈసీకి ఫిర్యాదుల వెల్లువ

By Siva KodatiFirst Published Oct 27, 2022, 9:31 PM IST
Highlights

మునుగోడు ఉపఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వ్యూహాలకు ప్రతివ్యూహాలను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తోంది. 

మునుగోడు ఉపఎన్నికపై బీజేపీ న్యాయ పోరాటం చేస్తోంది. మునుగోడు ఉపఎన్నికను ప్రభావితం చేసేలా టీఆర్ఎస్ ప్రవర్తిస్తోందని ఇందులో భాగంగానే ఫామ్‌హౌస్ డ్రామా ఆడిందంటూ సీఈవోకి ఫిర్యాదు చేసింది బీజేపీ నేత రచనా రెడ్డి బృందం. టీఆర్ఎస్ అక్రమాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అడ్డుకోలేకపోతోందని ఆరోపిస్తోంది. ఇప్పటికే తరుణ్ చుగ్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయగా.. ఇటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. 

ఇకపోతే.. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. మునుగోడు ఎన్నికల్లో నకిలీ నోట్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల కమీషన్ దృష్టికి ప్రదాన్ తీసుకెళ్లారు. ఇప్పటికే 12 వేల నకిలీ ఓట్లను తొలగించారని, మరో 14 వేల ఓట్లు తొలగించాల్సి వుందని చెప్పారు. అలాగే మునుగోడు ఎన్నికలో డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారని ... ప్రభుత్వ వాహనాలను కూడా ఇష్టానుసారంగా ఉపయోగిస్తున్నారని ఫిర్యాదు చేశారు ధర్మేంద్ర ప్రదాన్.

ALso REad:మునుగోడు ఉపఎన్నిక... టీఆర్ఎస్‌పై ఈసీకి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఫిర్యాదు

కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగిన వ్యవహారం సీఎం కేసీఆర్ అల్లిన కట్టుకథ అని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఈ కుట్రతో పోలీసులు భాగస్వామయ్యం కావొద్దని సూచించారు. మునుగోడు ఉపఎన్నికలో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ అంశం మీద సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ పై న్యాయ పోరాటానికి సిద్ధమైనట్లు లక్ష్మణ్ చెప్పారు. 

ఇక, ఎమ్మెల్యేల ప్రలోభాల వ్యవహారం టిఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మునుగోడులో దెబ్బ తినబోతోందని హైదరాబాద్ వేదికగా డ్రామాలకు తెరలేపారని అన్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు కేసీఆర్ ఆ స్వామీజీలను పిలిపించుకుని మాట్లాడారని, అక్కడే స్క్రిప్టు రాసి.. అమలు చేస్తున్నారని అన్నారు.  బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సీఎంకు సవాల్ విసురుతున్నా.. మీరు  యాదాద్రి వస్తారా? టైం, తేదీ మీరే చెప్పండి. బిజెపి తరఫున ఎవరు కోరుకుంటే వాళ్ళం వస్తాం. ఈ డ్రామా తో సంబంధం లేదని ప్రమాణం చేసే దమ్ము, ధైర్యం ఉందా?’  అని ప్రశ్నించారు.

ఈ వ్యవహారానికి పూర్తి  స్క్రీన్ ప్లే, దర్శకత్వం ప్రగతిభవన్ నుంచి నడిచిందని, సీఎం  కనుసన్నల్లోనే జరిగిందని అన్నారు. ఇందులో సైబరాబాద్ కమిషనర్ నటుడిగా మారారని అన్నారు.  గతంలో మంత్రిపై హత్యాయత్నం అంటూ డ్రామాలు ఆడారని అది ఫెయిల్ అవడంతో ఇప్పుడు సరికొత్త నాటకమాడుతున్నారని అన్నారు.  కొన్ని సీన్లు ముందే పోలీసులు రికార్డు చేసి పెట్టుకున్నారని వివరించారు.

click me!