రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మరో కరోనా కేసు బయటపడింది. డిల్లీలోని నిజాముద్దిన్ లో జరిగిన తబ్లిక్ జమాత్ కు హాజరైన యువకుడికి లక్షణాలు లేకున్నా పాజిటివ్ గా తేలింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు బయటపడింది. డిల్లీలో జరిగిన మర్కాజ్ ప్రార్థనలకు హాజరైన వేములవాడకు చెందిన నలుగురు యువకులకు కరోనా పరీక్షలు నిర్వహించారు జిల్లా వైద్యాదికారులు. వీరిలో ఓ యువకుడికి కరోనా పాజిటివ్ తేలడంతో అతన్ని వెంటనే హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటలకు తరలించారు.
గత నెలలో ఢిల్లీలోని నిజాముద్దిన్ ప్రాంతంలో జరిగిన తబ్లీగ్ జమాతేలో దేశ నలుమూలల నుండి ఓ సామాజికవర్గానికి చెందినవారు పాల్గొన్నారు. ఇలా మార్చి 14న వేములవాడకు చెందిన నలుగురు యువకులు కూడా వెళ్లారు.
అయితే డిల్లీ ఘటన బయటపడిన తర్వాత అప్రమత్తమైన సిరిసిల్ల జిల్లా అధికారులు ఈ నలుగురు యువకులను కూడా గుర్తించారు. మార్చి 31 నుండి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న యువకులకు పదిరోజుల క్రితం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో నలుగురికి నెగెటివ్ గా తేలినప్పటికి క్వారంటైన్ లో వుంచారు.
ఈ నలుగురు యువకులకు రెండవసారి గురువారం కరోనా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు జిల్లా వైద్యాధికారులు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో అనూహ్యంగా ఒకరికి కరోనా పాజిటివ్ గా తేలింది.
కొవిడ్-19 ఎలాంటి లక్షణాలు లేకుండా సదరు యువకునికి రెండోసారి నిర్వహించిన పరీక్షలో పాజిటివ్ గా తేలింది. దీంతో అధికారులు వెంటనే యువకున్ని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.