తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేరుస్తోంది... అర్హులైన రైతుల ఖాతాల్లో లక్ష రూపాయల చొప్పున జమచేస్తోంది. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో ఎప్పుడు చెక్ చేసుకోవాలంటే....
హైదరాబాద్ : తెలంగాణ రైతాంగం సంబరాలకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అన్నదాతలకు ఇచ్చిన రుణమాఫీ హామీని ఎదురుచూపులు లేకుండానే నెరవేరుస్తోంది. రూ.2 లక్షల లోపు రుణాల మాఫీకి సిద్దమైన రేవంత్ సర్కార్ ఇవాళ అంటే గురువారం లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి... అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు పడటమే మిగిలింది.
రైతుల ఖాతాల్లో లక్ష పడేదెప్పుడంటే :
undefined
ప్రస్తుత అధికార కాంగ్రెస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.2 లక్షల వ్యవసాయ రుణాల మాఫీ హామీ ఇచ్చారు. ఆ పార్టీ విజయంలో ఈ హామీ పాత్ర ప్రధానమైనది. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లోనూ సీఎం రేవంత్ రుణమాఫీ అస్త్రాన్ని ఉపయోగించారు... అయితే ఈసారి ఎప్పటిలోపు రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తారో కూడా ప్రకటించారు. ఆగస్ట్ 15 అంటే రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం నాటికి రుణమాఫీ చేసి తీరతామని సీఎ రేవంత్ స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో ఈ ఎన్నికల్లోనూ రైతులు కాంగ్రెస్ పక్షాన నిలిచారు.
తమ మాట నమ్మి అసెంబ్లీ ఎన్నికల ద్వారా అధికారాన్ని , లోక్ సభ ఎన్నికల్లో మంచి ఫలితాలను అందించిన రైతులకు అండగా నిలుస్తోంది రేవంత్ సర్కార్. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆర్థికంగా పెనుభారమే అయినా వ్యవసాయ రుణాల మాఫీ ప్రక్రియను చేపట్టింది ప్రభుత్వం. ఆగస్ట్ చివరినాటికి మూడు విడతల్లో ఈ రుణాల మాఫీ ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు ప్రకటించారు.
మొదటి విడతలో భాగంగా జూలై 18న అంటే ఇవాళ లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాలు మాఫీ కానున్నాయి. ఇలా దాదాపు 11 లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో లక్ష రూపాయల చొప్పున జమ చేసేందుకు రూ.7 వేల కోట్లను సిద్దం చేసింది ప్రభుత్వం. ఈ డబ్బులను రైతుల ఖాతాల్లో వేసేందుకు ముహూర్తం కూడా ప్రకటించారు. గురువారం (ఇవాళ) సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ కానున్నాయి... రాత్రి లోపు అర్హులైన ప్రతి అన్నదాత ఖాతాల్లో డబ్బులు పడతాయని అధికారులు చెబుతున్నారు.
అన్నదాతల రుణమాఫీ సంబరాలు :
ఇప్పటిక మొదటి విడత రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితాను ప్రభుత్వం సిద్దం చేసింది... అవి క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులకు కూడా చేరాయి. అయితే ఈ రుణమాఫీ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసమే ఇవాళ సాయంత్రం సంబరాలు చేపట్టింది. రుణాల మాఫీ అయిన రైతులను రైతు వేదికల వద్దకు ఆహ్వానించింది ప్రభుత్వం...వారిని మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు అభినందించనున్నారు. ఈ మేరకు రైతులు, ప్రజానిధులంతా కలిసి రుణమాఫీ సంబరాలు జరుపుకోవాలని ప్రభుత్వం సూచించింది.
స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ రైతు రుణమాఫీ సంబరాల్లో భాగస్వామ్యం కానున్నారు. ఇవాళ సాయంత్రం సరిగ్గా 4 గంటలకు సీఎం 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రుణమాఫీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించి వారి సంతోషాన్ని పంచుకోనున్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాలన్ని రైతులందరి ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి... టింగ్ టింగ్ మంటూ మెసేజ్ లు రానున్నాయి.