కరోనా వైరస్ ఎక్కడ తమనుండి మనవళ్లకు సోకుతుందేమోనన్న భయంతో ఇద్దరు వృద్దులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
హైదరాబాద్: కరోనా వైరస్ ఎక్కడ తమనుండి మనవళ్లకు సోకుతుందేమోనన్న భయంతో ఇద్దరు వృద్దులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. కరోనా నిర్దారణ కాకున్నా కేవలం లక్షణాలతో బాధపడుతున్న వృద్ద దంపతులు ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారు. కరోనా బారినపడిన కుటుంబసభ్యులను కనీసం చూడటానికి కూడా భయపడుతున్న ఇలాంటి సమయంలో తమవారి కోసం ఏకంగా ప్రాణాత్యాగానికి పాల్పడ్డారు ఈ దంపతులు. ఈ ఘటన కుటుంబ బంధాలు, బందుత్వాలు, ప్రేమకు నిదర్శనంగా నిలిచింది.
వివరాల్లోకి వెళితే... పంజాగుట్ట ప్రాంతంలోని రాజ్ నగర్ మక్తాలో వెంకటేశ్వర్ నాయుడు, వెంకటలక్ష్మి దంపతులు నివాసముంటున్నారు. వీరి ఇద్దరు కుమారులకు పెళ్లిల్లయి పిల్లలు కూడా వున్నారు. వీరంతా కలిసి ఒకే ఇంట్లో వుంటున్నారు.
అయితే గత పదిరోజుల నుండి ఈ వృద్దదంపతులిద్దరు దగ్గు, జలుబు వంటి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. మందులు వేసుకున్నా తగ్గడం లేదు. దీంతో తమకు ఎక్కడ కరోనా సొకిందోనన్న భయం వారిలో మొదలయ్యింది. ఇదెక్కడ తమ ఇంట్లో వుండే చిన్నారి మనవళ్లకు సోకుతుందేమోనని... వారికి తమవల్ల అపాయం కలగకకూడని భావించిన ఆ దంపతులు దారుణమైన నిర్ణయం తీసుకున్నారు.
read more మాస్క్ లేదని డాక్టర్ కి ఫైన్.. ఎమ్మెల్యేకి వర్తించదా?
శనివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో సూసైడ్ నోట్ రాసిపెట్టి కూల్‌డ్రింక్ లో పురుగుమందు కలిపుకు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబసభ్యులు ఇంటికి వచ్చేసరికి విగతజీవులుగా పడివున్నారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు.
''మాకు కరోనా లక్షణాలున్నాయి.మా నుండి ఈ వైరస్ మా మనవళ్లకు సోకే ప్రమాదం వుంది. అందువల్లే ఆత్మహత్య చేసుకుంటున్నాం'' అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు మృతులు వెంకటేశ్వర్-వెంకటలక్ష్మి దంపతులు.