
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘గృహలక్ష్మీ’ పథకానికి సంబంధించి మంత్రి ప్రశాంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గృహలక్ష్మీ పథకం నిరంతర ప్రక్రియ అని.. దరఖాస్తు గడువు విషయంలో విపక్షాలు, కొన్ని పత్రికలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని నమ్మొద్దని.. ఖాళీ స్థలం వున్న ఎవరైనా సరే గృహలక్ష్మీ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. తొలి దశలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఇళ్ల కేటాయింపులు వుంటాయని.. మిగిలిన వారు రెండో విడతలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. ప్రజలు తమ ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తులు పంపించవచ్చని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
కాగా.. గృహలక్ష్మీ పథకం కింద సొంత స్థలం వున్నవారికి ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మూడు లక్షల రూపాలయను కేటాయిస్తుంది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. దరఖాస్తు చేసేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు. అయితే తొలి విడతలో భాగంగా దరఖాస్తుకు ఈ నెల 10 వరకే గడువు వుండటంతో ప్రభుత్వ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంతి రెడ్డి స్పందించారు.