సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెడితే.. ఎన్నారైలకు హైదరాబాద్ పోలీసుల షాక్..

By SumaBala BukkaFirst Published Jan 5, 2022, 9:58 AM IST
Highlights

సోషల్ మీడియాలో ప్రత్యక్షమౌతున్న అభ్యంతరకరమైన, అశ్లీల, కించపరిచే పోస్టుల్లో కొన్ని ఇతర దేశాలనుంచి కూడా పోస్ట్ అవుతున్నాయి. వీటిని సృష్టిస్తున్న వ్యక్తుల్లో విదేశాల్లో ఉండే ఎన్నారైలు ఉండటంతో ఇప్పటివరకు పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు.కొన్ని కేసుల్లో మాత్రం అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు Look out  సర్క్యులర్ మాత్రమే జారీ చేస్తున్నారు. 

హైదరాబాద్ :  నగర పోలీసు విభాగం social mediaపై డేగకంటి నిఘా ఏర్పాటు చేస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా Cyberspace Policing చేపడుతోంది. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కొత్వాల్ CV Anand ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. Cyber ​​Crime Police Station తో పాటు ప్రతి ఠాణాలోనూ వీటిపై కేసు నమోదు చేయనున్నారు. 

అనేకమందికి ఇబ్బందులు...
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. ఎవరికివారు తమ ఆలోచనలను అందులో పొందుపరుస్తున్నారు. కొందరైతే కొన్ని వర్గాలను, రాజకీయ పార్టీలను టార్గెట్ గా చేసుకుంటున్నారు. మరి కొందరు మహిళలు, యువతులను కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. కుప్పలు కుప్పలుగా పుట్టుక వస్తున్న యూట్యూబ్ ఛానల్ లో కూడా కొన్ని ఇదే పంథాలో వెళ్తున్నాయి. 

ఈ పరిణామాలతో అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిలో అతి తక్కువ మంది మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీన్ని అలుసుగా తీసుకుంటున్న అనేక మంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

అవసరమైతే సుమోటో కేసులు..
వీటన్నింటినీ గమనించి నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తీవ్రంగా పరిగణించారు. ప్రతి ఒక్క పోలీసు అధికారి, సిబ్బంది సోషల్ మీడియాపై కన్నేసి ఉంచేలా సైబర్ స్పేస్ పోలీసింగ్ కు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు సోషల్ మీడియా వ్యవహారాలపై కేవలం సైబర్ క్రైమ్ ఠాణాలోనే కేసులు నమోదయ్యేవి. ఇకపై నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదు చేస్తారు.  బాధితులు ఎవరూ ముందుకు రాకుంటే సుమోటోగా కేసులు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేపట్టారు.

పాల్వంచ కుటుంబ ఆత్మహత్య ఘటనలో మరో విషాదం

ఈ వ్యవహారంలో పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని సివి ఆనంద్  ఆదేశాలు  జారీ చేశారు. ఈ కేసుల తీరుతెన్నులపై ఆయనే స్వయంగా పర్యవేక్షించనున్నారు.  సోషల్ మీడియాలో ప్రత్యక్షమౌతున్న అభ్యంతరకరమైన, అశ్లీల, కించపరిచే పోస్టుల్లో కొన్ని ఇతర దేశాలనుంచి కూడా పోస్ట్ అవుతున్నాయి. వీటిని సృష్టిస్తున్న వ్యక్తుల్లో విదేశాల్లో ఉండే ఎన్నారైలు ఉండటంతో ఇప్పటివరకు పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు.

కొన్ని కేసుల్లో మాత్రం అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు Look out  సర్క్యులర్ మాత్రమే జారీ చేస్తున్నారు.  దీంతో ఆ వ్యక్తులు దేశానికి వస్తేనే పట్టుకునే ఆస్కారం ఉంటుంది. ఇలాంటి వారికీ చెక్ చెప్పడానికి సివి ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఈ తరహా కేసులో నిందితులు ఎన్నారైలు ఉంటే వారి పాస్ పోర్టులు రద్దు చేయాల్సిందిగా ఆర్పిఓకు సిఫార్సు చేస్తారు.  దీంతో ఆయా వ్యక్తులను వారు ఉంటున్న దేశాలు బలవంతంగా తీపి పంపడానికి ఆస్కారం ఏర్పడుతుంది.

శిక్షలు  పడేవరకు పర్యవేక్షణ… 
యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియాలో అవాంఛనీయ పోస్టు పై కేసులు నమోదుతో సరి పెట్టవద్దని ఆనంద్ స్పష్టం చేశారు. ప్రతి కేసును చట్ట ప్రకారం దర్యాప్తు చేసి, నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కంటే వాట్సాప్, ట్విట్టర్ల ద్వారానే ఇలాంటివి ఎక్కువ సమస్యలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

వాట్సాప్ లో ఉండే గ్రూప్ లో వదంతులు విస్తరించడానికి  కారణం అవుతున్నాయని వివరిస్తున్నారు.  ఏ సమాచారం అయినా పూర్తిగా నిర్ధారించుకోకుండా ప్రచారం, షేరింగ్ చేయవద్దని అలా చేస్తే చట్ట ప్రకారం నేరమే అవుతుందని, అభ్యంతరకర కామెంట్లు చేసినా బాధ్యులేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
 

click me!