తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైదరాబాద్ జిల్లా ఎన్నికల విభాగం నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైదరాబాద్ జిల్లా ఎన్నికల విభాగం నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌ను రాజకీయ కార్యకలాపాలకు వినియోగించుకున్నారని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్‌కు నోటీసు జారీ చేసినట్టుగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. తొలుత ఫిర్యాదు అందిన తర్వాత మంత్రి కేటీఆర్ వివరణ కోరుతూ నోటీసు జారీ చేసినట్టుగా చెప్పారు. విచారణ అనంతరం ఎన్నికల సంఘానికి నివేదిక పంపనున్నట్టుగా చెప్పారు.
ఈసీ మార్గదర్శకాల ప్రకారం కేటీఆర్ నుంచి సంబంధిత అధికారులు వివరణ తీసుకుంటారని తెలిపారు. అతిథి గృహాలు, బంగ్లాలు సహా ప్రభుత్వ భవనాలను ప్రచారానికి వినియోగించరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు డీఈఏకు దాదాపు 120 ఫిర్యాదులు అందాయి.
ఇక, ప్రగతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించారని.. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి నిరంజన్ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రగతి భవన్‌లో రైతు జాయింట్ యాక్షన్ కమిటీ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారని.. రైతులపై కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారని, డీజీపీ, ఎస్పీతో మాట్లాడారని తన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.