పార్టీ మారుతామనే వాళ్లను ఆపబోం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

By Mahesh KFirst Published Jun 23, 2023, 4:52 PM IST
Highlights

తెలంగాణ బీజేపీలో అసంతృప్తి రాగాలు వినిపిస్తున్న వేళ ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునిగిపోయే నావలోకి వెళ్లుతామనే వారిని ఎవరూ ఆపబోరని స్పష్టం చేశారు.
 

హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో అసంతృప్తులు ఉన్నారని, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు పార్టీ మారుతారని వార్తలు జోరుగా వస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో నేతల మధ్య విభేదాల గురించి రిపోర్టు అడిగిన ప్రశ్నలకు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. పార్టీ మారడం అనేది వారి వారి  రాజకీయల ఆలోచనలకు అనుగుణంగా ఉంటుందని అన్నారు. 

కాంగ్రెస్‌ను పరోక్షంగా పేర్కొంటూ.. మునిగిపోయే నావలోకి వెళ్లుతామనే వాళ్లను తాము ఎవ్వరమూ ఆపబోమని స్పష్టం చేశారు. డిపాజిట్లు రాని, అసలు అభ్యర్థులే లేని పార్టీలోకి ఎవరు పోతారనేది అసలు ప్రశ్న అని తెలిపారు. తమ పార్టీ నుంచి ఎవరూ పోవడం లేదని అన్నారు. అది కేవలం మీడియా దుష్ప్రచారం అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై మరింత స్పష్టత కోసం విలేకరులు ప్రశ్నించగా.. తమ పార్టీ నుంచి ఎవ్వరూ పోరు అని చెప్పారు.

Latest Videos

Also Read: ‘అసంతృప్త నేతలు’ ఈటల, రాజగోపాల్‌కు అధిష్టానం పిలుపు.. గుడ్ న్యూస్ చెబుతారా? బుజ్జగింపులేనా?

ఈ సందర్భంగా ఆయన అటు కాంగ్రెస్‌ను ఇటు బీఆర్ఎస్‌ను విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఆదరణే లేదని, అందులోకి తమ పార్టీ నుంచి ఎవరూ పోవడం లేదని అన్నారు. బీఆర్ఎస్ పై విమర్శలు సంధిస్తూ.. ఎన్నికలు సమీపించగానే కేసీఆర్‌కు అమరవీరులు గుర్తుకువచ్చారా? అంటూ ప్రశ్నించారు. ఏనాడూ కనీసం అమరవీరులకు జోహార్లు చెప్పలేదని, ఇవాళ విపరీత ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందిస్తామని చెప్పారు.

బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో మార్పు జరుగుతుందని గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. పార్టీలోకి వచ్చినప్పుడే బీజేపీ హామీ ఇచ్చినట్టుగా ఈటల రాజేందర్‌కు మంచి స్థానం ఇస్తారనే అభిప్రాయాలూ వచ్చాయి. కానీ, పార్టీలో మార్పు జరగలేదు. ఈటల రాజేందర్ ఆశించిన స్థానం లేదా పదవీ దక్కలేదు. దీంతో ఈటల రాజేందర్, మునుగోడులో ఓటమి తర్వాత రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ పార్టీ మారుతారనే చర్చ మొదలైంది.

ఈ వార్తలను రాజగోపాల్ రెడ్డి ఖండించలేదు. విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ ఖండించారు. అధిష్టానం తనకు ఇప్పుడు కాకున్నా మరికొంత సమయం తీసుకుని అయినా.. ఆశించిన స్థానాన్ని ఇస్తుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. 

click me!