మిషన్ భగీరథకు జాతీయ అవార్డు విషయంలో తెలంగాణ సర్కార్‌వి అబద్దాలు.. కేంద్రం కౌంటర్

By Sumanth KanukulaFirst Published Oct 1, 2022, 1:40 PM IST
Highlights

మిషన్ భగీరథకు జాతీయ ప్రభుత్వ అవార్డు వచ్చిందనే కామెంట్స్‌పై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ స్పందించింది. మిషన్ భగీరథకు జాతీయ అవార్డు ఇచ్చామని చెప్పడంలో వాస్తవం లేదని పేర్కొంది.

మిషన్ భగీరథకు జాతీయ ప్రభుత్వ అవార్డు వచ్చిందనే కామెంట్స్‌పై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ స్పందించింది. మిషన్ భగీరథకు జాతీయ అవార్డు ఇచ్చామని చెప్పడంలో వాస్తవం లేదని పేర్కొంది. మిషన్ భగీరథకు సంబంధించి రాష్ట్రానికి జాతీయ అవార్డు రావడంపై తెలంగాణ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదనలు తప్పుదారి పట్టించడమే కాకుండా “వాస్తవాల ఆధారంగా లేవు” అని పేర్కొంది.

ఈ పథకాన్ని కేంద్రం అసలు అంచనా వేయలేదని తెలిపింది. తెలంగాణలో 100 శాతం నీటి కనెక్షన్లు ఇచ్చినట్టుగా కేంద్రం ఎక్కడ ధ్రువీకరించలేదని స్పష్టం చేసింది. జల్ జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం 100 శాతం నల్లా కనెక్షన్లు ఉన్నట్లు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల ద్వారా తీర్మానాలు చేయాలని తెలిపింది. కానీ పంచాయతీల ద్వారా ఇప్పటి వరకు ధ్రువీకరించలేదని పేర్కొంది. గ్రామీణ గృహాలకు నీటి సరఫరా విభాగంలో మాత్రమే అక్టోబర్ 2న తెలంగాణకు అవార్డు ఇస్తున్నట్టుగా తెలిపింది. 

ఇదిలా ఉంటే.. ‘‘మిషన్ భగీరథకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని అందిస్తున్న మిషన్‌భగీరథ పథకానికి మరోసారి కేంద్రప్రభుత్వ అవార్డు దక్కింది’’ అని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం, పలువురు మంత్రులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మిషన్‌ భగీరథకు జాతీయ అవార్డు ప్రకటించలేదని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కౌంటర్ ఇచ్చింది. ఇది మరోసారి తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్దానికి దారితీసే అవకాశం ఉంది. 
 

click me!