రేషన్ కార్డు కేవైసీ చివరి తేదీపై మంత్రి గంగుల కమలాకర్ గుడ్ న్యూస్.. ఏమన్నారంటే?

By Mahesh K  |  First Published Sep 30, 2023, 2:10 PM IST

రేషన్ కార్డు కేవైసీ చేసుకోవడానికి ఈ రోజే చివరి తేదీ అని సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారం అవుతున్నది. దీనితో చాలా మంది రేషన్ కార్డుదారులు ఆందోళనలో మునిగారు. ఒక వైపు తమ వేలి ముద్రలు పడక.. ఆధార్ కేంద్రాల్లో అప్‌డేట్ చేసుకోలేక, మరికొన్ని చోట్ల రేషన్ షాపులు తెరవక నానా అవస్థలు పడుతున్నారు. ఈ చివరి తేదీ అంశంపై మంత్రి గంగుల కమలాకర్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు.
 


హైదరాబాద్: ఇవాళ రేషన్ కార్డు ఈకేవైసీకి చివరి తేదీ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. దీంతో రేషన్ కార్డుదారులు గందరగోళంలో పడిపోయారు. కొన్ని చోట్ల రేషన్ షాపులు తెరిచి ఉండటం లేదు. చాలా చోట్ల రేషన్ కార్డుదారులు ఈకేవైసీ కోసం రేషన్ డీలర్ల చుట్టూ తిరుగుతున్నారు. రేషన్ షాపుల ముందు బారులు తీరుతున్నారు. కొందరివి వేలిముద్రలు నమోదయ్యాయి. అయితే, చాలా మంది కేవైసీ ప్రక్రియ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నది.

చిన్న పిల్లల వేలి ముద్రలు పడకపోవడంతో చాలా మంది మీసేవ, ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అలాగే.. ఆధార్ కార్డు తీసుకున్న చాలా ఏళ్లు గడుస్తున్నందున ఇప్పుడు వేలి ముద్రలు సరిగా పడటం లేదు. ఈ కారణంగా కూడా చాలా మంది వేలి ముద్రలు అప్‌డేట్ చేసుకోవడానికి ఆధార్ కేంద్రాల ముందు క్యూలు కడుతున్నారు. అయితే.. ఈ వేలి ముద్రలు అప్‌డేట్ కావడానికి కూడా 90 రోజులు పడుతుంది. దీంతో రేషన్ కార్డు ఈకేవైసీ ఈ రోజుతో (సెప్టెంబర్ 30వ తేదీ) ముగుస్తుందనే ప్రచారం ఉండటంతో ఆందోళనలో పడుతున్నారు. ఈకేవైసీ చేసుకోకుంటే అతని పేరు రేషన్ కార్డులో కట్ అవుతుందని భయపడుతున్నారు. ఫలితంగా అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకూ దూరం అవుతామని కలవరపడుతున్నారు.

Latest Videos

అలాగే.. చాలా మంది స్వగ్రామానికి దూరంగా ఉంటున్నవారూ ఉన్నారు. హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లలు, ఉద్యోగాల కోసం పట్నాలకు వెళ్లినవారూ, ఉపాధి కోసం గల్ఫ్ వంటి దేశాలకు వెళ్లినవారూ ఇంకా అనేక ఇతర కారణాలతో ఇంటికి దూరంగా ఉంటున్నవారూ ఈకేవైసీ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: Viral Video: ఆడి ఏ4 లగ్జరీ కారులో రైతు.. మార్కెట్‌కు వెళ్లి కూరగాయల విక్రయం.. నోరెళ్లబెడుతున్న నెటిజన్లు

ఈ చివరి తేది పై ప్రభుత్వం నుంచి కూడా స్పష్టత రాకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం అవుతున్నది. బోగస్ రేషన్ కార్డులను ఎత్తివేస్తామని చెబుతున్నప్పటికీ వాస్తవంలో నిజమైన కార్డుదారులు కూడా రేషన్ కార్డులో సభ్యత్వం కోల్పోయే ప్రమాదం అంచునకు చేరుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలపైనా వ్యతిరకత వస్తున్నది. ఈ తరుణంలోనే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు.

రేషన్ కార్డు ఈకేవైసీ గురించి గాబరా పడుతున్నవారికి మంత్రి గంగుల ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఈకేవైసీకి చివరి తేదీ అంటూ లేదని స్పష్టత ఇచ్చారు. చాలా మంది తెలంగాణ వాసులు దుబాయ్ సహా వేర్వేరు దేశాల్లో ఉన్నారు. కాబట్టి, ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడామని మంత్రి గంగుల వివరించారు. చివరి తేదీని పొడిగించాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. కేవైసీకి ఇంకా సమయం ఉన్నదని చెప్పుకొచ్చారు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు.

click me!