
హైదరాబాద్: రాష్ట్రంలో బంద్‌లు, లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూ విధించే అవకాశం లేదని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆదివారం నాడు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర ప్రభావం తెలంగాణపై ఉందన్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారిందని ఆయన చెప్పారు.
సెకండ్ వేవ్ తొలుత హైద్రాబాద్‌లో మొదలైందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 260 టన్నుల ఆక్సిజన్ అవసరమౌంది. రానున్ రోజుల్లో ఇది 300 టన్నుకు పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
రాష్ట్రానికి అవసరమైన కరోనా వ్యాక్సిన్ డోసులు పంపాలని కేంద్రాన్ని కోరినట్టుగా ఆయన తెలిపారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాలని ఆయన కోరారు. రోగి పరిస్థితిని బట్టి చికిత్సను అందించాలని ఆయన కోరారు. అవసరమైతేనే రోగికి ఆక్సిజన్ ను అందించాలన్నారు.రేపటి నుండి రెమిడెసివర్ ఇంజక్షన్ల ఉత్పత్తి పెరగనుందన్నారు. ఈ విషయమై తాను మంత్రి కేటీఆర్ ఆయా పార్మా కంపెనీలతో మాట్లాడినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఈ ఇంజక్షన్ ఉత్పత్తిని కంపెనీలు పెంచాయని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో బెడ్స్ కొరత లేదన్నారు. 65 వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వాసుపత్రులలో రోగులకు సరిపడు బెడ్స్ ఉన్నాయని ఆయన తెలిపారు. మాస్కులు, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని ఆయన ప్రజలను కోరారు. ప్రజలంతా స్వీయ నియంత్రణను పాటించాలని ఆయన సూచించారు. దేశంలో కరోనాను అత్యంత కట్టుదిట్టంగా కట్టడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని దేశం మొత్తం చెబుతుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది, తెలంగాణలో ఎలా ఉందో బేరీజు వేసుకోవాలన్నారు.