
త్రివిధ దళాల్లో నియామకాల్లో కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం జరిగిన హింసాకాండలో ఒకరు మృతిచెందగా.. 13 మంది గాయపడిన సంగతి తెలిసిందే. గాయపడినవారికి ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. అయితే గాయపడిన యువకుల శరీరాల్లో బుల్లెట్ ఆనవాళ్లు కనిపించలేదని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎం. రాజారావు తెలిపారు. వారిలో కొందరి శరీరాల్లో మాత్రమే పెల్లెట్లు ఉన్నాయని, వాటిని తొలగించామని ఆయన తెలిపారు.
శుక్రవారం రైల్వే స్టేషన్ అల్లర్లలో గాయపడిన మొత్తం 14 మందిని గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వారిలో వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం దబీర్ పేట్ గ్రామానికి చెందిన డి రాకేష్ అనే వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. అతని మరణానికి కారణాన్ని తెలుసుకోవడానికి.. అదే రోజు పోస్టుమార్టమ్ పరీక్ష((PME) నిర్వహించించబడిందని.. అయితే పీఎంఈ రిపోర్టును నేరుగా పోలీసులకు పంపుతామని డాక్టర్ రాజారావు తెలిపారు.
గాయపడిన 13 మందిలో ముగ్గురికి ఛాతీ గాయాలయ్యాయని డాక్టర్ రాజారావు చెప్పారు. వారికి కార్డియోథొరాసిక్ సర్జరీ జరిగిందని తెలిపారు. మరో వ్యక్తికి తొడ ఎముక విరిగిపోవడంతో చికిత్సలో భాగంగా రాడ్‌ను అమర్చినట్టుగా వెల్లడించారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో ఎనిమిది మంది యుకులు డిశ్చార్జ్‌కి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయితే వారిని ఒకటి, రెండు రోజులు ఆస్పత్రిలోనే ఉంచే అవకాశం ఉందన్నారు. మరోవైపు అగ్నిపథ్ అలర్లల్లో గాయపడిన వారు చికిత్స పొందుతున్న వార్డుల వద్ద పోలీసులు భద్రత ఏర్పాట్లు చేపట్టారు. పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది ఆసుపత్రిలోని రెండు ఎంట్రీ పాయింట్ల వద్ద కాపలాగా ఉంచారు. గాయపడిన వారిలో కొందరు చికిత్స పొందుతున్న ఎమర్జెన్సీ బ్లాక్ వద్ద పోలీసులు కూడా ఉన్నారు. అనుమతి లేనిదే గాయపడిన వారి వద్దకు ఎవరిని పోలీసులు అనుమతించడం లేదు.