కాంగ్రెస్ ఎఫెక్ట్: మళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్‌ను పెంచుతాం: కేసీఆర్

By narsimha lodeFirst Published Oct 3, 2018, 4:57 PM IST
Highlights

మళ్లీ అధికారంలోకి వస్తే  ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ను కూడ పెంచుతామని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు


నిజామాబాద్: మళ్లీ అధికారంలోకి వస్తే  ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ను కూడ పెంచుతామని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. అయితే ఎంత మేరకు పెన్షన్ ను పెంచనున్నామనేది త్వరలోనే ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ప్రకటించనుందని ఆయన తెలిపారు. 

నిజామాబాద్‌లో బుధవారం నాడు టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించింది. ఈ సభలో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో నిజామాబాద్ జిల్లా అగ్రభాగాన నిలిచిందన్నారు.

టీఆర్ఎస్‌కు స్వతంత్రంగా జడ్పీ ఛైర్మెన్ ను గెలిపించిన ఘనత నిజామాబాద్ జిల్లా ప్రజలదని ఆయన గుర్తు చేశారు. పౌరుషానికి నిజామాబాద్ జిల్లా ప్రతీకగా నిలిచిందన్నారు. గత ఎన్నికల్లో  టీఆర్ఎస్ కు  అన్ని అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లను గెలిపించారన్నారు.తెలంగాణ ఆత్మగౌరవ జెండాను గౌరవించింది నిజామాబాద్ జిల్లా అని ఆయన కొనియాడారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  ఒక్కొక్క సమస్యను  పరిష్కరించుకొంటూ  ముందుకువెళ్లినట్టు ఆయన చెప్పారు. అధికారంలోకి వచ్చే సమయంలో రాష్ట్రంలో ఉన్నవిద్యుత్ సమస్యను అధిగమించినట్టు ఆయన తెలిపారు. 

ప్రతీ ఇంటికి మంచినీరు, ప్రతి ఎకరానికి సాగు నీరు అందించే దిశగా  టీఆర్ఎస్ సర్కార్ కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులతో  సాగు, తాగు నీటిని అందిస్తున్నామని చెప్పారు.

రూ.42వేల కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను  అమలు చేసినట్టు ఆయన చెప్పారు. 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రమేనని ఆయన చెప్పారు. 

ఆర్థిక ప్రగతిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు.  కాంగ్రెస్ పార్టీ నేతలు ఇసుకను దోచుకొన్నారని ఆయన చెప్పారు. పదేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో కేవలం రూ.9 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని ఆయన చెప్పారు.నాలుగున్నర ఏళ్లలో ఇసుకపై రూ.1995 కోట్లు సాధించినట్టు చెప్పారు.

తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు కేసులు వేస్తున్నారని  కేసీఆర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 196 కేసులు వేశారని చెప్పారు. ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఏకం కావాల్సిందిపోయి.... ప్రాజెక్టులను ఆపేందుకు కేసులు వేస్తున్నారని విపక్షాలపై కేసీఆర్ దుమ్మెత్తిపోశారు.

ఉద్యోగులకు టీఆర్ఎస్ ఏ రకంగా స్నేహపూర్వకంగా ఉందో ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. భవిష్యత్‌లో కూడ ఉద్యోగులకు వేతనాల పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు.

తెలంగాణ ప్రజలు వద్దని చెబుతోంటే 1954లో తెలంగాణను ఆంధ్రప్రదేశ్ లో కలిపిందని  కేసీఆర్ గుర్తు చేశారు. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని కర్కశంగా అణచివేసిందని కేసీఆర్ విమర్శించారు.  తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్, టీడీపీ నేతలు ఓట్లు అడుగుతారని కేసీఆర్ ప్రశ్నించారు.
 

 

click me!