ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కు.ని. ఆపరేషన్లు చేసుకున్న నలుగురు మృతి: విచారణ చేస్తున్నామన్న డీహెచ్

By narsimha lodeFirst Published Aug 30, 2022, 12:53 PM IST
Highlights

ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న నలుగురు మహిళలు మృతి చెందడంపై విచారణ చేస్తున్నామన్నారు. నిపుణులైన వైద్యులే ఆపరేషన్లు నిర్వహించారని ఆయన గుర్తు చేశారు

హైదరాబాద్:ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న నలుగురు మహిళలు మృతి చెందడంపై విచారణ జరుపుతున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు మంగళవారం నాడు  హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. 

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ నెల 25న నిపుణులైన వైద్యులతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహించినట్టుగా డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. అయితే ఆపరేషన్ తర్వాత  కూడా జాగ్రత్తలు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆపరేషన్ చేసుకున్న వారికి కూడా మందులు ఇచ్చి జాగ్రత్తలు చెప్పి ఇంటికి పంపించినట్టుగా డాక్టర్ శ్రీనివాసరావు వివరించారు. ఈ నెల 26, 27 తేదీల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న 34 మందిలో నలుగురు అస్వస్థతకు గురైనట్టుగా ఆసుపత్రిలో ఫిర్యాదు చేశారని చెప్పారు.

వీరికి వెంటనే ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించామన్నారు. అంతేకాదు కొందరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో  చేరారని డాక్టర్ శ్రీనివాసరావు వివరించారు.  కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వారిలో నలుగురు మృతి చెందడం దురదృష్టకరమని ఆయన చెప్పారు.  ఈ నలుగురు మహిళలు మృతి చెందడానికి  గల కారణాలను అన్వేషిస్తున్నామని డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు.  ఈ నెల 25న ఆపరేషన్ చేయించుకున్న వారిని తమ స్పెషల్ మెడికల్ టీమ్ పరిశీలించిందన్నారు. నిన్న రాత్రి ఏడుగురిని హైద్రాబాద్ కు తరలించినట్టుగా చెప్పారు.  ఇవాళ మరో ఇద్దరిని నిమ్స్ ఆసుపత్రికి తరలించినట్టుగా డాక్టర్ శ్రీనివాసరావు వివరించారు.

also read:ఇబ్రహీంపట్నంలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్: మూడు రోజుల్లో నలుగురు మృతి, విచారణకు ఆదేశం

మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు డుబల్ బెడ్ రూమ్  ఇంటిని ఇవ్వనున్నట్టుగా చెప్పారు. మృతుల పిల్లల చదువుకు ప్రబుత్వం సహకారం అందించనుందన్నారు. గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో 36 వేల మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించిట్టుగా డాక్టర్ శ్రీనివాసరావు గుర్తు చేశారు. ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన వైద్యుడు చాలా సీనియర్ అని  డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

2016 నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విషయంలో టార్గెట్లు లేవన్నారు.. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకుంటున్నారని డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. 2021-21లో 1.10 లక్షల ఆపరేషన్లు నిర్వహించామన్నారు.  ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు 111 క్యాంపుల్లో  38,656 సర్జరీలు చేసినట్టుగా డాక్టర్ శ్రీనివాసరావు వివరించారు.  ఇబ్రహీంపట్నం ఘటనపై  ఐదుగురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసినట్టుగా డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.  ఇబ్రహీం పట్నం హాస్పిటల్ సూపరింటెండెంట్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని ఆయన తెలిపారు..సర్జరీ చేసిన డాక్టర్ లైసెన్స్ ను తాత్కాలికంగా రద్దు చేసినట్టుగా డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. 

click me!