నల్లగొండ కాంగ్రెస్ నేత మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్

First Published Feb 13, 2018, 2:57 PM IST
Highlights
  • నల్లగొండ జిల్లా ఉపసర్పంచ్ హత్య వెనుక అక్రమ సంబంధం
  • చిన్న భార్య స్కెచ్ వేసి హతం చేసినట్లు పోలీసుల ప్రకటన
  • జిల్లాలో సంచలనం రేపిన ఉప సర్పంచ్ ధర్మా నాయక్ హత్య

నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ఉప సర్పంచ్ హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఇది రాజకీయ హత్య కాదని మిర్యాలగూడ పోలీసులు తేల్చేశారు. అక్రమ సంబంధం కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసుల విచారణ లో తేలింది. సంచలనం రేపిన ఈ హత్య గురించి గ్రామస్తులు, మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి మండలం, నాగార్జునపేట తండా ఉపసర్పంచ్ దేపావత్ ధర్మానాయక్(45) నిన్న రాత్రి హత్యకు గురయ్యాడు. ధర్మానాయక్ కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు సావిత్రి. రెండో భార్య పేరు శిరీష. మొదటి భార్యకు పెళ్లయిన తర్వాత సంతానం కలగకపోవడంతో తన సొంత చెల్లెలు శిరీషను ఇచ్చి రెండో వివాహం జరిపించారు. రెండో భార్యకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం కలిగింది.

అయితే ధర్మానాయక్ వయసు 45 కాగా చిన్నభార్య శిరీష వయసు 22 మాత్రమే. దీంతో ఇద్దరి మధ్య వయో బేధం ఉండడంతో శిరీష అదే గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ఈ విషయం తెలిసి ధర్మానాయక్ పలుసార్లు శిరీషను మందలించాడు. ఇటీవల శిరీష తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. నెలరోజుల తర్వాత ఇద్దరు కలిసి తిరిగొచ్చారు. తర్వాత భార్య, భర్తలు ఇద్దరు రాజీ పడి తిరిగి కాపురం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా ధర్మానాయక్ ను వదిలించుకోవాలని.. ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేయాలని శిరీష నిర్ణయించుకుంది.

వ్యవసాయం కోసం ధర్మానాయక్ ఇటీవల రెండు ఎద్దులు కొనుగోలు చేశాడు. ఆ ఎద్దులను పొడిచేందుకు గ్రామంలోని వేరే ఎద్దులు వస్తాయన్న ఉద్దేశంతో ధర్మానాయక్ గత కొంత కాలంగా ఇంటి ముందు కొట్టంలోనే నిద్రిస్తున్నాడు. అయితే నిన్న రాత్రి కూడా ధర్మానాయక్ ఆరుబయట పడుకున్నాడు. తన కొడుకు కూడా తనతోనే పడుకున్నాడు. భార్య శిరీష మంచం పక్కనే కింద పడుకుంది. రాత్రి బాంబు పేలుడు జరిగిన తర్వాత సీన్ కట్ చేస్తే.. ధర్మానాయక్ కొడుకు, భార్య ఇంట్లో పడుకున్నారు. దీంతో ఈ కోణంలో పోలీసులు విచారణ జరిపి ఆమె నుంచి వాస్తవాలు సేకరించారు.

దీపావళి పండుగ సందర్భంగా పేల్చే లక్ష్మీ బాంబులో ఉండే పేలుడు పదార్థాన్ని అరకిలో వరకు సేకరించి దాన్ని మంచం మీద పెట్టి పేల్చినట్లు సంఘటనను బట్టి చూస్తే తెలుస్తోంది. ఆ పేలుడుకు ధర్మానాయక్ శరీరం ముక్కలు ముక్కలుగా తయారైంది. మంచం కూడా రెండు తున్కలైంది. ఆయన శరీర భాగాలు చిందరవందరగా పడడాన్ని చూసిన గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. మృతుడి తల్లి ద్వాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగార్జున సాగర్ సీఐ రవీందర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రెండో భార్య శిరీషను పోలీసులు విచారిస్తున్నారు. ఆమె ప్రియుడు రవి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

 

click me!