హుజురాబాద్ ఉపఎన్నిక: టీఆర్ఎస్‌కు జై కొట్టిన నాయి బ్రాహ్మణులు.. గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తామని తీర్మానం

By Siva KodatiFirst Published Sep 8, 2021, 9:05 PM IST
Highlights

హుజురాబాద్‌ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపుకు సహకరిస్తామని పట్టణ నాయి బ్రాహ్మణ కులస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం  తీర్మానం ప్రతిని మంత్రి గంగుల కమలాకర్‌కు సమర్పించారు.
 

హుజురాబాద్‌ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపుకు సహకరిస్తామని పట్టణ నాయి బ్రాహ్మణ కులస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం  తీర్మానం ప్రతిని మంత్రి గంగుల కమలాకర్‌కు సమర్పించారు. బుధవారం హుజురాబాద్ సిటీ సెంటర్ హాల్ మందిరంలో నాయి బ్రాహ్మణ కులస్తుల ఆత్మీయ సమ్మేళన సమావేశం జరిగింది... ఈ సమావేశానికి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ.. బీసీ కులాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

కులవృత్తులకు జీవం పోసి .. అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని గంగుల అన్నారు. తెలంగాణ ప్రభుత్వం , ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అడగకుండానే వరాలు కురిపించే దేవుడు కేసీఆర్ అని మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి  ఓటు వేయడంతో పాటు తమ సెలూన్‌లకు వచ్చే కష్టమర్లకు ప్రభుత్వ పని తీరు వివరించి ఓట్లు వేయించి మద్దతు కూడగట్టాలని నాయి బ్రాహ్మణులకు గంగుల విన్నవించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు అండగా నిలిచిందని నాయి బ్రాహ్మణులకు వ్యక్తిగత రుణాలతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బీసీలంతా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. 

హుజరాబాద్ పట్టణ అభివృద్ధికి 70 కోట్ల నిధులు మంజూరు చేయించడంతో పాటు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని, పనులన్నీ చురుకుగా కొనసాగుతున్నాయని గంగుల కమలాకర్ అన్నారు. రానున్న రోజుల్లో హుజరాబాద్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి చెప్పారు. ఈటల తెలంగాణ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి హుజురాబాద్‌ను ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు.

ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈటల విఫలమయ్యారని నియోజకవర్గంలోని బీసీలను రాజకీయంగా ఎదగకుండా అణగదొక్కారని గంగుల ఆరోపించారు. ఈటల పాదయాత్ర దేనికోసం చేస్తున్నారని ప్రజలు ఎదురు తిరుగాలని పిలుపునిచ్చారు. హుజురాబాద్ పట్టణంలో నాయి బ్రాహ్మణుల ఆత్మగౌరవ భవనానికి 10 కుంటల భూమితో పాటు నిర్మించుకోవడానికి నిధులు కూడా మంజూరు చేశామని గంగుల వెల్లడించారు.

click me!