ఉమ్మడి వరంగల్‌లో వర్ష బీభత్సం: ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడండి.. అధికారులకు ఎర్రబెల్లి ఆదేశం

By Siva KodatiFirst Published Sep 8, 2021, 8:38 PM IST
Highlights

భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండి పర్యవేక్షించాలని సూచించారు. వరద నిర్వహణ కోసం శాశ్వత ప్రాతిపదికన పగడ్బందీగా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు

భారీ వర్షాలు, వరదల దృష్ట్యా ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో వర్షాలు‌, రహదారులు‌, పాఠశాలలో మౌళిక వసతుల కల్పనపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

అన్ని శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండి పర్యవేక్షించాలని సూచించారు. వరద నిర్వహణ కోసం శాశ్వత ప్రాతిపదికన పగడ్బందీగా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. విష జ్వరాలు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. గ్రామాల్లో నిరంతరం శానిటేషన్ పనులు ముమ్మరంగా చేపట్టాలని ఎర్రబెల్లి ఆదేశించారు. నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ALso Read:తెలంగాణలో భారీ వర్షాలు: స్థంభించిన జనజీవనం, ఆరుగురు మృతి

మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో వివిధ నిర్మాణాలకు టెండర్లును తక్షణమే పిలవాలని తెలిపారు. అక్రమ నిర్మాణాలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. గత సంవత్సరం కురిసిన వర్షాల కంటే ఈ సంవత్సరం నష్టాన్ని తగ్గించగలిగామని ఎర్రబెల్లి అన్నారు. గ్రామీణ రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇండ్లు,రహదారుల గురించి అధికారులను ఆరా తీశారు. జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని దయాకర్ రావు అన్నారు. ప్రతి పాఠశాలను ప్రతిరోజూ శుభ్రం చేయాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రి సూచించారు. 

click me!