వైఎస్ షర్మిలపై అసభ్యకర పోస్టులు: మరో యువకుడి అరెస్టు

By pratap reddyFirst Published Feb 4, 2019, 7:14 AM IST
Highlights

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిలపై సోషల్‌ మీడియాలో సాగించిన అసభ్యకరమైన ప్రచారం విషయంలో నమోదైన కేసులో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మరింత పురోగతి సాధించారు.

హైదరాబాద్‌: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిలపై సోషల్‌ మీడియాలో సాగించిన అసభ్యకరమైన ప్రచారం విషయంలో నమోదైన కేసులో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మరింత పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రకాశం జిల్లా వేములకు చెందిన పెద్దిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్‌ వెంకటేష్‌ను ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఆదివారం తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన నవీన్‌ను అరెస్టు చేశారు. మరికొందరు బాధ్యుల్ని గుర్తించడానికి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు యూట్యూబ్‌కు సంబంధించిన లాగిన్‌ వివరాలు ఆరా తీస్తున్నారు.

కేసు దర్యాప్తునకు కీలక ప్రాధాన్యమిస్తున్న అధికారులు నిందితుల్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. షర్మిల తన ఫిర్యాదుతో పాటు దాదాపు 60 యూట్యూబ్‌ లింకుల్ని పోలీసులకు సమర్పించారు. వీటిని పరిశీలించిన అధికారులు ఆ అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై దృష్టి పెట్టారు. ఏడుసార్లు కామెంట్లు పెట్టిన వెంకటేష్‌ను శనివారం గుంటూరులో అరెస్టు చేసి తీసుకొచ్చారు.

ఆదివారం మంచిర్యాలలోని రామ్‌నగర్‌కు చెందిన అద్దూరి నవీన్‌ను అరెస్టు చేశారు. నవీన్‌ నాలుగు వీడియోల కింది భాగంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వెంకటేష్‌ను ఆదివారం ఉదయం మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. 


న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. దీంతో అతన్ని చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. నవీన్‌ను సైతం మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచి సోమవారం రిమాండ్‌కు తరలిస్తారు.

click me!