తెలంగాణలో వడగళ్ళ వాన... టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తప్పిన పెనుప్రమాదం

By Arun Kumar PFirst Published Jan 12, 2022, 3:07 PM IST
Highlights

ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తృటితో పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు. 

వరంగల్‌: టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (peddi sudarshan reddy)కి పెను ప్రమాదం తప్పింది. ఉమ్మడి వరంగల్ 9warangal) జిల్లాలో నిన్న(మంగళవారం) వడగళ్ల వాన బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఇలా వర్షం కురుస్తున్న సమయంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నల్లబెల్లి మండలంలో పర్యటిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈదురుగాలులు, వడగళ్ల వాన బీభత్సానికి భారీ వృక్షం విరిగి ఎమ్మెల్యే కారు ముందే కుప్పకూలింది. 

ఈ ప్రమాదం నుండి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తృటిలో తప్పించుకున్నారు. ఎమ్మెల్యే కారు కొద్దిముందుకు వెళ్లివుంటే వృక్షం దానిపై పడివుండేది. వెంటనే ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది, స్థానికుల వృక్షాన్ని తొలగించి రోడ్డు క్లియర్ చేసారు.

ఇదిలావుంటే కరీంనగర్ (karimnagar) నగరంలోనూ మంగళవారం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. నగరంలోని గీతాభవన్ చౌరస్తాలో వేంకటేశ్వర స్వామి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కొద్ది రోజుల క్రితం ఏర్పాటు చేసిన 70 అడుగుల ఎత్తైన విద్యుత్ దీపాల అలంకరణ లుమినార్ కూలిపోయింది. పట్టాభిషేకాన్ని ఆవిష్కరించేలా సుమారు రూ. 45 లక్షలు వెచ్చించి ఈ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. అయితే గాలుల ధాటికి భారీ కటౌట్‌ నెలకొరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

నిన్న సాయంత్రం తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురిసింది. మంగళవారం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. మరో రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 

ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణలోకి బలంగా గాలులు వీస్తున్నాయని ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్టుగా వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉందని అంచనా వేశారు. 

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. వడగళ్ల వానలు కొన్ని ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ కారణంగా పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

గత 24 గంటల్లో సిద్దిపేట జిల్లా (siddipet district) చిన్నకొడూరులో అత్యధికంగా 85.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగింది. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు కరీంనగర్‌‌లోని శంకరపట్నంలో 60.8 మి.మీ, మానుకొండూరులో 56.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక, నిర్మల్, కొమురంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ  వర్షం కురిసింది. 

హైదరాబాద్‌ (hyderabad)లో కూడా మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బొల్లారం, తిరుమలగిరి, కార్ఖానతో పాటు కుషాయిగూడ, సైనిక్‌పురి, మౌలాలి, చర్లపల్లి, బేగంపేట, చిలకగూడ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాష్ట్రంలో అక్కడక్కడ వడగళ్లతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది.


 

click me!