నకిరేకల్‌లో నర్రాదే హవా: ఐదుసార్లు వరుసగా విజయం

By narsimha lodeFirst Published Oct 23, 2018, 4:56 PM IST
Highlights

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థిగా  నర్రా రాఘవరెడ్డి ఆరు దఫాలు విజయం సాధించారు. 

నకిరేకల్: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థిగా  నర్రా రాఘవరెడ్డి ఆరు దఫాలు విజయం సాధించారు.  1978 నుండి 1994 వరకు  ఆయన వరుసగా విజయం సాధించారు.  ఈ నియోజకవర్గంలో  ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో సీపీఐ(ఎం)  8 దఫాలు విజయం సాధించింది

నకిరేకల్  నియోజకవర్గం నుండి సీపీఐ(ఎం)కు కంచుకోటగా ఉండేది. ఏ పార్టీతో పొత్తులు లేకున్నా ఈ స్థానం నుండి ఆ పార్టీ  విజయం సాధించిన సందర్భాలు కూడ ఉన్నాయి.

1957లో నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1957లో జరిగిన ఎన్నికల్లో  పీడీఎఫ్ అభ్యర్థిగా ధర్మబిక్షం విజయం సాధించారు. ఆ తర్వాత  జరిగిన ఎన్నికల్లో  సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన నంద్యాల శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. 

1967లో  నకిరేకల్ స్థానం నుండి సీపీఐ(ఎం) అభ్యర్థిగా బరిలోకి దిగిన నర్రా రాఘవరెడ్డి విజయం సాధించారు.  ఆ తర్వాత 1972లో జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మూసపాటి కమలమ్మ చేతిలో నర్రా రాఘవరెడ్డి ఓటమి పాలయ్యారు.

1978 నుండి 1994 వరకు వరుసగా నర్రా రాఘువరెడ్డి  సీపీఐ(ఎం) అభ్యర్థిగా  విజయం  సాధించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో సీపీఐ(ఎం) శాసనసభపక్షనాయకుడిగా, ఉపనాయకుడిగా కూడ సుదీర్ఘ కాలం పాటు ఆయన పనిచేశారు.

1978లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.నర్సయ్యపై నర్రా రాఘవరెడ్డి విజయం సాధించారు. 1983లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇంద్రసేనారెడ్డిపై నర్రా రాఘవరెడ్డి విజయం సాధించారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రభంజనంలో కూడ నర్రా గెలుపొందారు.

1985లో కాంగ్రెస్ కు చెందిన డి. వెంకటరాములుపై నర్రా రాఘవరెడ్డి గెలిచారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జి.విద్యాసాగర్ రెడ్డిపై విజయం సాధించారు. 1994లో స్వతంత్ర అభ్యర్థి నేతి విద్యాసాగర్ పై నర్రా రాఘవరెడ్డి గెలుపొందారు.

ఆరు దఫాలు నర్రా రాఘవరెడ్డి నకిరేకల్ నియోజకవర్గం నుండి విజయం సాధించినప్పటికీ... ఆయన ఈ నియోజకవర్గానికి చెందిన ఓటరు కాదు. ఆయన స్వగ్రామం చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామం.స్థానికేతరుడని ప్రత్యర్థులు నర్రాపై ప్రచారం చేసినా ఈ నియోజకవర్గ ఓటర్లు ఆయనను గెలిపించారు.

1999 ఎన్నికల్లో  నకిరేకల్ ఎంపీపీగా ఉన్న నోముల నర్సింహ్మయ్యకు సీపీఐ(ఎం) ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ కల్పించింది. దీంతో నర్రా రాఘవరెడ్డి నోముల నర్సింహ్మయ్య గెలుపులో కీలక పాత్ర పోషించారు.1999లో టీడీపీ అభ్యర్థి కటికం సత్తయ్య గౌడ్ పై నోముల నర్సింహ్మయ్య విజయం సాధించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సీపీఎం శాసనసభపక్ష నేతగా పనిచేశారు.

 2004లో కూడ మరోసారి కటికం సత్తయ్యగౌడ్ పై  మరోసారి సీపీఎం అభ్యర్థి  నోముల నర్సింహ్మయ్య విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభనతో నకిరేకల్ నియోజకవర్గం 2009లో ఎస్సీలకు రిజర్వ్ అయింది.  ఆ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థిగా మామిడి సర్వయ్య బరిలో దిగారు. 

అయితే  సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న నూనె వెంకటస్వామి పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ఈ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచాడు. నూనె వెంకటస్వామిని పార్టీ నుండి  బహిష్కరించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య విజయం సాధించారు.  2014 ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం విజయం సాధించారు.

click me!