కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తొలిసారిగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం భేటీ అయ్యారు.
హైదరాబాద్: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారంనాడు భేటీ అయ్యారు. గత నెల 28వ తేదీన వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరారు. వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరడాన్ని గతంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యతిరేకించారు. దీంతో వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరిక ఆలస్యమైంది. అయితే వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరికకు పార్టీ అధిష్టానం అంగీకరించడంతో గత నెల 28వ తేదీన వీరేశం పార్టీలో చేరారు.
కాంగ్రెస్ లో చేరిన తర్వాత తొలిసారిగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో వేముల వీరేశం భేటీ అయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నకిరేకల్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన చిరుమర్తి లింగయ్య చేతిలో వేముల వీరేశం ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా వేముల వీరేశం పోటీ చేశారు.
undefined
2018 ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. నకిరేకల్ అసెంబ్లీలోని బీఆర్ఎస్ లో చిరుమర్తి లింగయ్య, వేముల వీరేశం వర్గాలుగా పార్టీ చీలిపోయింది. రెండు వర్గాల మధ్య పలు దఫాలు ఘర్షణలు కూడ చోటు చేసుకున్నాయి.మరోవైపు నకిరేకల్ నుండి బీఆర్ఎస్ టిక్కెట్టును వేముల వీరేశం ఆశించారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకే బీఆర్ఎస్ టిక్కెట్టు కేటాయించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో వేముల వీరేశం పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ వీరేశం పార్టీలో చేరడాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ వీరేశం చేరికకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా ఇతర నేతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే పార్టీలో చేరికల విషయాన్ని తాను పార్టీ నాయకత్వం వద్ద చర్చిస్తానని మూడు రోజుల క్రితం మీడియా సమావేశంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. నల్గొండ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త శ్రీనివాస్ హత్య విషయంలో అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న వేముల వీరేశంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గీయులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.