జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికే టిక్కెట్టివ్వాలని ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు.
జనగామ: జనగామ అసెంబ్లీ స్థానం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి బీఆర్ఎస్ టిక్కెట్టు ఇవ్వాలని ఆయన అనుచరులు శనివారంనాడు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టిక్కెట్టు ఇవ్వవద్దని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అనుచరులు కోరుతున్నారు.జనగామలోని నెహ్రూ పార్క్ నుండి ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసుకొనేందుకు ప్రయత్నించారు. పోలీసులు దిష్టిబొమ్మ దగ్దం చేయకుండా అడ్డుకున్నారు.ఈ విషయమై పోలీసులు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వర్గీయుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది.
జనగామ అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన హైద్రాబాద్ ప్రగతి భవన్ కు సమీపంలోని టూరిజం హోటల్ లో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వర్గీయులు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వీరిని హైద్రాబాద్ కు రప్పించినట్టుగా ప్రచారం సాగింది. టూరిజం హోటల్ లో బీఆర్ఎస్ నేతల సమావేశానికి తనకు సంబంధం లేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రకటించారు.
undefined
టూరిజం హోటల్ లో సమావేశమైన వారితో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడ మాట్లాడారు. మరునాడు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హైద్రాబాద్ లోని ఫంక్షన్ హల్ లో తన అనుచరులతో భేటీ అయ్యారు. ముత్తిరెడ్డికే టిక్కెట్టివ్వాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఇవాళ కూడ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు.
స్టేషన్ ఘన్ పూర్ లో తాటికొండ రాజయ్య వర్గీయుల ఆందోళన
స్టేషన్ ఘన్ పూర్ లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి వ్యతిరేకంగా సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వర్గీయులు ఆందోళనకు దిగారు. రాజయ్యకే టిక్కెట్టివ్వాలని ఆయన మద్దతుదారులు కోరుతున్నారు. నిన్న స్టేషన్ ఘన్ పూర్ లో పార్టీ కార్యకర్తల సమావేశంలో కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజయ్య వర్గీయులు ఇవాళ ఆందోళనకు దిగారు.