మునుగోడు బౌండరీలు తెలుసా... నమ్ముకున్న జనాన్ని అనాథల్ని చేశారు : రాజగోపాల్ రెడ్డిపై కూసుకుంట్ల విమర్శలు

By Siva KodatiFirst Published Oct 7, 2022, 6:39 PM IST
Highlights

బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మండిపడ్డారు మునుగోడు ఉపఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గ హద్దులు కోమటిరెడ్డికి తెలియదని.. నమ్ముకున్న మునుగోడు ప్రజలను అనాథల్ని చేశారని ఆయన ఎద్దేవా చేశారు. 

నమ్ముకున్న మునుగోడు ప్రజలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనాథగా చేసి వెళ్లిపోయారని అన్నారు టీఆర్ఎస్ నేత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రభాకర్ రెడ్డిని కేసీఆర్ ఎంపిక చేశారు. దీంతో ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసిన కూసుకుంట్ల సీఎం చేతుల మీదుగా బీ ఫామ్‌ను అందుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి అంటున్నారని, మరి బీజేపీ తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ కాదా అని కూసుకుంట్ల ప్రశ్నించారు. 

ఏ విధంగా నిధులు తీసుకొచ్చి మునుగోడును అభివృద్ధి చేస్తారో చెప్పాలని రాజగోపాల్ రెడ్డిని నిలదీశారు. తనపై నమ్మకంతో నాలుగోసారి కేసీఆర్ బీ ఫామ్ ఇచ్చారని... మునుగోడులో టీఆర్ఎస్‌దే గెలుపని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో బీజేపీకి డిపాజిట్ కూడా రాదని.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల గౌరవం పోగొట్టారని కూసుకుంట్ల వ్యాఖ్యానించారు. మునుగోడు నియోజకవర్గ హద్దులు కోమటిరెడ్డికి తెలియదని ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

ఇకపోతే... మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. సీఎం కేసీఆర్  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును శుక్రవారం నాడు  ప్రకటించారు. ఉద్యమకారుడుగా పార్టీ ఆవిర్భావ కాలం నుంచి కొనసాగుతూ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే అభ్యర్ధిగా కేసీఆర్ ప్రకటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, జిల్లా పార్టీ నాయకత్వం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టులను పరిశీలించిన మీదట సిఎం కెసిఆర్  ఈ నిర్ణయం తీసుకున్నారు.

ALso Read:మునుగోడు ఉపఎన్నిక : కేసీఆర్‌తో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భేటీ

2014 ఎన్నికల్లో ఈ స్థానం నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.2018 ఎన్నికల్లో ఈ స్థానం నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత కూడా నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. 

మరోవైపు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్ భేటీ అయ్యారు. అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు అభివృద్ధి కోసం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలన్నారు నర్సయ్య గౌడ్. టికెట్ ఆశించడం తప్పు కాదని.. తన అవసరం జాతీయ రాజకీయాల్లో వుంటుందని కేసీఆర్ అన్నారని ఆయన తెలిపారు. కేసీఆర్ ఆదేశాలు పాటిస్తానని నర్సయ్యగౌడ్ స్పష్టం చేశారు. కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. మునుగోడు టీఆర్ఎస్‌లో అసంతృప్తి లేదన్నారు. అందరిలాగే తాను కూడా టికెట్ ఆశించానని.. తనకు ఆ హక్కు వుందని కర్నె చెప్పారు. కేసీఆర్ నిర్ణయం అమలు చేయాల్సిన బాధ్యత తమపై వుందని ఆయన పేర్కొన్నారు. అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ బలోపేతం కోసమేనని కర్నె చెప్పారు. కూసుకుంట్లను భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఆయన పేర్కొన్నారు. 
 

click me!