మునుగోడు ఉపఎన్నిక: తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్.. నల్గొండ కలెక్టర్ ఉత్తర్వులు..

Published : Oct 03, 2022, 04:52 PM IST
మునుగోడు ఉపఎన్నిక: తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్.. నల్గొండ కలెక్టర్ ఉత్తర్వులు..

సారాంశం

మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. నల్గొండ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘించిన వారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని నల్గొండ కలెక్టర్ హెచ్చ‌రించారు. 

మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. నల్గొండ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం మునుగోడుతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోకి మరో ఆరు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మునుగోడు నియోజకవర్గంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నేటి నుంచి న‌ల్ల‌గొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని క‌లెక్ట‌ర్ విన‌య్ కృష్ణారెడ్డి ఉత్త‌ర్వులు జారీ చేశారు. 

ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘించిన వారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని నల్గొండ కలెక్టర్ హెచ్చ‌రించారు. ఉప ఎన్నిక ప్రక్రియ ముగిసేవరకు ఎన్నికల కోడ్ కొనసాగనుంది. మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 2.7 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 70 శాతం వెనుకబడిన తరగతుల వారు ఉన్నారు.

ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం..  ఈనెల 7న మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల సమర్పణకు ఈనెల 14వరకు తుది గడవుగా నిర్ణయించారు. ఈ నెల 15న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు అవకాశం కల్పించారు. ఇక, నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. 

ఇక, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలకు ముందే.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మునుగోడులో గెలుపే లక్ష్యంగా ప్రణాళికులు రచించాయి. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఖరారు చేశాయి. బీజేపీ తమ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బరిలో దింపనుంది. అయితే టీఆర్ఎస్ మాత్రం తమ పార్టీ అభ్యర్థి ఎవరనేది అధికారికంగా ప్రకటించలేదు. అయితే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని టీఆర్‌ఎస్ నుంచి బరిలో నిలిపే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  

PREV
click me!

Recommended Stories

JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?
Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu