మునుగోడు బై పోల్ 2022: టీఆర్‌ఎస్‌‌ను వెంటాడుతున్న భయాలు.. ఆ పరిణామాలతో ఆందోళనలో పార్టీ అధిష్టానం!

Published : Aug 29, 2022, 09:44 AM IST
మునుగోడు బై పోల్ 2022: టీఆర్‌ఎస్‌‌ను వెంటాడుతున్న భయాలు.. ఆ పరిణామాలతో ఆందోళనలో పార్టీ అధిష్టానం!

సారాంశం

మునుగోడు ఉప ఎన్నిక‌‌లో విజయమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ కూడా మునుగోడుపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ విజయానికి కలిసికట్టుగా పని చేయాలని నియోజకవర్గ నేతలను కేసీఆర్ తీవ్రంగా హెచ్చరించినప్పటికీ.. స్థానిక నేతలు కొందరు దానిని లెక్కచేయడం లేదు. 

మునుగోడు ఉప ఎన్నిక‌‌లో విజయమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి.  అధికార టీఆర్ఎస్ కూడా మునుగోడుపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు.. మునుగోడు ఉప ఎన్నికను సెమీ ఫైనల్‌గా భావిస్తున్న తరుణంలో.. ఈ ఎన్నికను గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే మునుగోడులో టీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభ వేదికగా ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కేసీఆర్.. టీఆర్ఎస్‌ను గెలిపించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అయితే ఆ సభ వేదికగా కేసీఆర్.. మునుగోడు‌లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేస్తారని అంతా భావించారు. అయితే అలా జరగలేదు. 

అయితే ఇందుకు కారణం మునుగోడు టీఆర్ఎస్‌లో నెలకొన్న పరిస్థితులేనని తెలుస్తోంది. రానున్న మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ విజయానికి కలిసికట్టుగా పని చేయాలని నియోజకవర్గ నేతలను కేసీఆర్ తీవ్రంగా హెచ్చరించినప్పటికీ.. స్థానిక నేతలు కొందరు దానిని లెక్కచేయడం లేదు. దీంతో స్థానికంగా పార్టీ నేతల్లో ఉన్న అసమ్మతి అధిష్టానాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిణమాలు ఇలాగే కొనసాగితే మునుగోడు ఉప ఎన్నికలో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందనే భయం వెంటాడుతోంది. 

మరోవైపు ఉపఎన్నికకు జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్నందున.. సర్వేలు నిర్వహించి గెలిచే అవకాశం ఉన్న వ్యక్తినే అభ్యర్థిగా ఖరారు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గెలుపు, కులం, ఇతర సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పార్టీ అభ్యర్థిని నిర్ణయిస్తామని.. మునుగోడు టీఆర్ఎస్ టికెట్‌ను ఆశిస్తున్న నేతలకు కేసీఆర్ చెప్పినట్టుగా సమాచారం. 

అయితే జిల్లా ఇన్‌చార్జి మంత్రి జగదీష్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని మునుగోడు బరిలో నిలపాలనే అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్ వద్ద ఉంచారు. అయితే నియోజకవర్గంలో పలువురు నేతలు మాత్రం ప్రభాకర్‌రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారికి నచ్చజెప్పేందుకు జగదీష్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వారిని జగదీష్ రెడ్డి సీఎం కేసీఆర్‌ వద్దకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు చక్కబడతాయని భావించారు. కానీ కొన్ని గంటల్లోనే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. చౌటుప్పల్‌లో కొందరు స్థానిక నేతలు సమావేశం నిర్వహించి.. ప్రభాకర్‌‌ రెడ్డిని రంగంలోకి దింపాలని అధిష్టానం నిర్ణయిస్తే తాము పార్టీ కోసం పనిచేయబోమని తేల్చిచెప్పారు. ఈ మేరకు తీర్మానం కూడా చేశారు. 

ఇదిలా ఉంటే.. బీసీ నేతలు కూడా పార్టీ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఉన్నారు. 2014లో ఆయనకు టికెట్ నిరాకరించడంతో పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. ప్రభాకర్‌ రెడ్డి అభ్యర్థిత్వంపై స్థానిక నేతలు అసంతృప్తితో ఉన్నందున.. తనకు అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానాన్ని కర్నె ప్రభాకర్ కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ కర్నె ప్రభాకర్‌కు టికెట్ కేటాయిస్తే.. నియోజకర్గంలో బీసీ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉండటం ఆయనకు ప్లస్ పాయింట్ కావచ్చని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. 

మరోవైపు శాసనమండలి చైర్‌పర్సన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన కుమారుడు అమిత్‌రెడ్డికి మునుగోడు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థి విషయంలో కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని గుత్తా చెబుతున్నప్పటికీ..  తన కుమారుడికి టిక్కెట్టు దక్కించుకోవడానికి ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదని టీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. 

ఇక, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణా రెడ్డి కూడా మునుగోడు టికెట్‌ను ఆశిస్తున్నవారిలో ఉన్నారు. అయితే ఇటీవల ఆయనను ప్రగతిభవన్‌కు పిలిచిన కేసీఆర్.. పార్టీ కోసం పని చేయాలని సూచించారు. అభ్యర్థి ఎవరైనా పార్టీ కోసం కష్టపడాలని.. తర్వాత తగిన ప్రతిఫలం ఇస్తానని కృష్ణారెడ్డికి కేసీఆర్ చెప్పారని తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్