మునుగోడు మండలం గూడపూర్ వద్ద రూ. 13 లక్షలను ఇవాళ పోలీసులు సీజ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలను పురస్కరించుకొని పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ నగదు పట్టుబడింది.
మునుగోడు: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక నేపథ్యంలో పలు చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు అధికారులు. శుక్రవారం నాడు మునుగోడు మండలం గూడపూర్ వద్ద రూ. 13 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు.
మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఈ ఏడాది నవంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి..ఎన్నికల కోడ్ ఇప్పటికే అమల్లోకి వచ్చింది.దీంతో నియోజకవర్గానికి వచ్చే మార్గాల్లో పలుచోట్ల 14 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. మునుగోడు మండలం గూడపూర్ వద్ద కారులో రూ. 13 లక్షలను తీసుకువెళ్తున్న నర్సింహ్మ నుండి పోలీసులు నగదును సీజ్ చేశారు. హైద్రాబాద్ లో తన ఫ్లాట్ విక్రయించగా వచ్చిన నగదుగా నర్సింహ్మ పోలీసులకు చెప్పారు.
undefined
దసరా సందర్భంగా తన స్వగ్రామానికి వచ్చినందున తన వెంట ఈ నగదును తీసుకు వచ్చినట్టుగా ఆయన చెప్పారు. దసరా పండుగకు స్వగ్రామం నుండి హైద్రాబాద్ కు వెళ్తూ తన డబ్బును తీసుకెళ్తున్నానని నర్సింహ్మ పోలీసులకు తెలిపారు. అయితే ఫ్లాట్ విక్రయానికి సంబంధించి డాక్యుమెంట్లు చూపితేఈ డబ్బులను నర్సింహ్మకు పోలీసులు అప్పగించనున్నారు.
మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ఇవాళ విడుదలైంది.ఇవాళ్టి నుండి నామినేషన్లను స్వీకరించనున్నారు.ఈ నెల 14 వ తేదీవరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 17న నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజు. వచ్చే నెల 3వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. వచ్చే నెల 6వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు.
మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి బరిలోకి దిగింది. బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీలోకి దిగారు. బీఆర్ఎస్ అభ్యర్ధిని ఇంకా ప్రకటించలేదు. మాజీఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని సమాచారం. నిన్నటి నుండే టీఆర్ఎస్ నేతలు తమకుకేటాయించిన గ్రామాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు.
ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే స్థానానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను స్పీకర్ వెంటనే ఆమోదించారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందే కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ ఏడాది ఆగస్టు 21న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు.
also read:మునుగోడు బైపోల్ 2022: నేటి నుండి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్న బీఆర్ఎస్
ఈ స్థానాన్ని కైవసం చేసుకొనేందుకు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈస్థానంలో విజయం సాధించడం కోసం మూడు పార్టీల నేతలు ఇప్పటికే నియోజకవర్గంలో మోహరించారు.