Munugode Bypoll 2022: మునుగోడుపై వేగం పెంచిన కాంగ్రెస్.. ఈ నెల 13 నుంచి నియోజకవర్గంలో పాదయాత్ర..

By Sumanth KanukulaFirst Published Aug 11, 2022, 2:26 PM IST
Highlights

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక హీట్ మొదలైంది. మునుగోడు‌పై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్.. విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే చండూరులో సభ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ.. ఈ నెల 13 నుంచి మునుగోడులో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. 

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక హీట్ మొదలైంది. మునుగోడు‌పై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్.. విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే చండూరులో సభ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ.. ఈ నెల 13 నుంచి మునుగోడులో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. సంస్థాన్ నారాయణపురం నుంచి చౌటుప్పల్ వరకు పాదయాత్రను నిర్వహించనున్నారు. ఈ పాదయాత్రలో టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, సీనియర్ నేత మధుయాష్కి పాల్గొననున్నారు. ఈ నెల 16న రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొననున్నారు. ఇక, ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో జెండా వందనం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అలాగే అమిత్ షాతో బీజేపీ సభ నిర్వహించే రోజు.. గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలుపాలని ఆలోచనలు చేస్తోంది. 

ఇక, మునుగోడు ఉప ఎన్నికపై  కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్నికల వ్యుహాకర్త సునీల్ కనుగోలు బృందంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలతో పాటు ముఖ్యనేతలు సమావేశమయ్యారు. మరోవైపు ఈ రోజు ఉదయం హైదర్ గౌడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మాణిక్కం ఠాగూర్‌తో చెరుకు సుధాకర్ సమావేశమయ్యారు. అయితే మర్యాదపూర్వకంగానే మాణిక్కం ఠాగూర్‌తో భేటీ అయినట్టుగా చెరుకు సుధాకర్ చెప్పారు. 

ఇదిలా ఉంటే.. కొద్దిసేపటి క్రితం గాంధీభవన్‌లో మాణిక్కం ఠాగూర్ అధ్యక్షతన టీ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి, బోస్ రాజు, మహేష్ కుమార్ గౌడ్, దామోదర్ రెడ్డి, మధుయాష్కీ.. తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మునుగోడు ఉప ఎన్నికపై చర్చిస్తున్నారు. 

ఇక, ఈ రోజు మీడియాతో చిట్‌ చాట్ నిర్వహించిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటే అని విమర్శించారు. ఎలాంటి ఒప్పందం లేకుండానే రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఐదు నిమిషాల వ్యవధిలోనే ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. ఎన్నికలకు అంత అర్జెంట్ ఏముందని ప్రశ్నించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్‌కు అవసరమని, మునుగోడు ఉప ఎన్నిక బీజేపీకి అవసరమని అన్నారు. ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటుంన్నారని ఆరోపించారు. 

click me!