మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఈనెల 14వ తేదీన కొత్త ఓటర్ జాబితాను విడుదలచేయవద్దని బీజేపీ డిమాండ్ చేసింది.ఈ విషయమై హైకోర్టులో బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది.
హైదరాబాద్:మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి కొత్తగా నమోదైన ఓట్లలో నకిలీ ఓటర్లున్నారని బీజేపీ ఆరోపిస్తుంది. ఈ విషయమై హైకోర్టులో మంగళవారం నాడు బీజేపీ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశించే వరకు కొత్త ఓటర్ జాబితాను ప్రకటించవద్దని బీజేపీ డిమాండ్ చేసింది.
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలకు ఈ ఏడాది జూలై 31 వరకు ఉన్న ఓటరు జాబితాను పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ ఆ పిటిషన్ లో కోరింది. కొత్తగా నమోదైన ఓటరు జాబితాలో నకిలీ ఓటర్లున్నారని బీజేపీ ఆరోపిస్తుంది. అతి తక్కువ సమయంలోనే 25 వేల మంది కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారని బీజేపీ తెలిపింది. కొత్తగా నమోదైన ఓటర్లలో నకిలీలు ఉన్నారని బీజేపీ ఆరోపిస్తుంది.
ఈ నెల 14న కొత్త ఓటరు జాబితాను ప్రకటించేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తుంది. అయితే కొత్త ఓటరు జాబితాను హైకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు ప్రకటించవద్దని బీజేపీ కోరింది. మునుగోడు ఉప ఎన్నికను పురస్కరించుకొని హైద్రాబాద్ తో పాటు ఇతరప్రాంతాల్లో ఉన్న వారు కూడా తమ ఓటుహక్కును మునుగోడు నియోజకవర్గంలో నమోదు చేసుకొనేందుకు ధరఖాస్తు చేసుకున్నారు.
కొత్తగా నమోదైన ఓటర్లలో బోగస్ ఓటర్లున్నారని కాంగ్రెస్ పార్టీ కూడ అనుమానిస్తుంది. ఈ విషయమై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఈసీకి ఐదు రోజుల క్రితం లేఖ రాశాడు.రాజకీయ పార్టీలతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిర్వహించినసమావేశంలో కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ ఈ విషయాన్ని ప్రస్తావించారు.
also read:ప్రత్యర్ధుల దుశ్చర్య:చండూరులో ప్రచార సామాగ్రి దగ్దంపై రేవంత్ రెడ్డి
మునుగోడు అసెంబ్లీ స్థానానికి నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ ఏడాది ఆగస్టు 8న ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. అంతకు నాలుగు రోజుల ముందు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఏడాది ఆగస్టు 21న రాజగోపాల్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. గతఎన్నికల్లో ఇదే స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీకి దిగారు.