ఒక కుటుంబం కోసం పార్టీని బలిచేయలేం, తప్పు చేస్తే సీఎం నన్ను కూడా వదలరు : ఎంపి కవిత

First Published Jun 27, 2018, 12:15 PM IST
Highlights

డీఎస్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం కు లేఖ...

టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ నిజామాబాద్ సీనియర్ నాయకుడు డి. శ్రీనివాస్‌ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఎంపీ కవిత ఆరోపించారు. టీఆర్ పార్టీ, కేసీఆర్ కు 2014 లో అండగా నిలబడి జిల్లాలోని 9 ఎమ్మెల్యే సీట్లను అందించిన నిజామాబాద్ ప్రజలపై ఉన్న గౌరవంతోనే డీఎస్ ను సీఎం టీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకున్నట్లు కవిత తెలిపారు. జిల్లా ప్రజలకు ఆయన సేవ చేస్తాడని బావిస్తే డీఎస్ మాత్రం తన కుటుంబం కోసం పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నాడని కవిత మండిపడ్డారు. ఇలా ఓ కుటంబం కోసం పార్టీని నాశనం చేయడం ఇష్టం లేదని, అందువల్లే  నిజామాబాద్ జిల్లా నేతలమంతా సమావేశమై ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్ ని కోరినట్లు  కవిత తెలిపారు.

కాంగ్రెస్ పార్టీలో అవమానాలు ఎదురవడంతో డీఎస్ టీఆర్ఎస్ లో చేరినట్లు కవిత తెలిపారు. కానీ ఆయన టీఆర్ఎస్ లోకి రాగానే క్యాబినెట్ హోదా ఇచ్చి రాజ్యసభకు కూడా పంపించి గౌరవించామని అన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజల కోసం, సీఎం సూచనల మేరకు ఇప్పటివరకు ఆయనకు తగిన విదంగా గౌరవిస్తున్నామని కవిత తెలిపారు. అయితే డీఎస్ మాత్రం వేరే పార్టీలో చేరిన కుటుంబ సభ్యులకోసం టీఆర్ఎస్ పార్టీని బలహీనపరుస్తున్నారని అన్నారు. ఆయన బహిరంగాగానే తన కుటుంబ సభ్యులకు అండగా నిలబడతానని చెబుతున్నట్లు తమకు సమాచారం అందని అన్నారు. 

ఇక టీఆర్ఎస్ పార్టీలోని కింది స్థాయి కార్యకర్తలను వేరే పార్టీల్లో చేరాల్సిందిగా డీఎస్ సూచిస్తున్నట్లు సమాచారం అందిందని కవిత అన్నారు. ఆయన కూడా మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారని అందువల్లే గత మూడు రోజులుగా డిల్లీలో ఉండి మంతనాలు జరుపుతున్నారని కవిత తెలిపారు. తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని సీఎం చెప్పారని, రేపు నేను తప్పు చేసినా తనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని కవిత అన్నారు. అందువల్ల డీఎస్ పై చర్యలు తీసుకోవాలని సీఎం ను కోరనున్నట్లు కవిత తెలిపారు. 

ఇవాళ ఎంపి కవిత తన క్యాంపు కార్యాలయంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. వీరంతా కలిసి డీఎస్ పై వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సీఎం కు లేఖ రాశారు. జిల్లా ప్రజల, నాయకుల ఆవేధన తెలియజేయడానికి అందరం కలిసి ఈ లేఖను సీఎం కు అందించనున్నట్లు కవిత పేర్కొన్నారు.

ఈ బేటీకి నిజామాబాద్ ఎంపి కవితతో పాటు జహిరాబాద్ ఎంపి  బీబీ పాటిల్‌, పార్టీ జిల్లా ఇంచార్జి తుల ఉమ, ఎమ్మెల్యేలు ప్రశాంత్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, జీవన్‌రెడ్డి, షకీల్‌ అహ్మద్, ఏనుగు రవీందర్‌రెడ్డి హాజరయ్యారు.  
 

click me!